
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై మంగళవారం రాత్రి 8:30లోగ తుది నిర్ణయం తెలపాలని గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఎన్సీపీకి గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే ఎవరూ ముందుకు రాకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమయిందని గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారని తెలుస్తోంది. దీనిపై మంగళవారం ఎన్సీపీకి ఇచ్చిన గడువు వరకు వేచి చూసే అవకాశం ఉంది. అనంతరం కీలక నిర్ణయం తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్సీపీ కూడా నో చెబితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే సూచనలు కనిపిస్తోంది.
అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ ముందుకు రావాలి అంటే మిత్రపక్షం కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి. ఇటు శివసేనకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై హస్తం నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. దీనిపై సోమవారంమే పార్టీ వర్కింగ్ కమిటీ గంటల తరబడి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయినా తమ నిర్ణయాన్ని వెల్లడించడంలో మాత్రం ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం సోనియా అధ్యక్షతన సీడబ్ల్యూసీ మరోసారి భేటీ అయింది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుపై నేడు పార్టీ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే సీఎం పీఠం ఎన్సీపీకి అప్పగిస్తేనే మద్దతు తెలపాలని కాంగ్రెస్ ముఖ్యనేతలు కోరినట్లు తెలిసింది. మరోవైపు శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌తో శరద్ పవార్ భేటీ అయ్యారు. అయితే సమావేశం అనంతరం భేటీ వివరాలను వెల్లడించడానికి పవార్ నిరాకరించారు. మంగళవారం వరకు గడువు ఉండటంతో మరోసారి ఎన్సీపీ, కాంగ్రెస్ నిర్ణయం కోసం సేన నేతలు ఎదురు చూస్తున్నారు. ఇదిలావుండగా.. తాజా పరిణామాలను బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది.
మరోవైపు ఎన్సీపీ నేతలు కూడా మరోసారి కీలక భేటీ నిర్వహణకు సిద్ధమయ్యారు. గవర్నర్ ఇచ్చిన గడువుకు సమయం దగ్గర పడుతుండటంతో నేటి మధ్యాహ్నాంలోపు ఇరు పార్టీల నుంచి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇదిలావుండగా.. సీఎం కుర్చీని అధిష్టించాలనుకున్న శివసేన ఆశలు అడియాశలుగానే మిగిలేలా ఉన్నాయి. సోమవారంమే కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తుందని ఆశించిన శివసేన చివరి నిమిషం వరకు ఎదురుచూసింది. అయితే దీనిపై మరింత లోతుగా చర్చించిన అనంతరమే తమ నిర్ణయం ప్రకటిస్తామని హస్తం నేతలు ప్రకటించారు. దీంతో సేన నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
కేంద్రమంత్రి పదవికి శివసేన ఎంపీ అరవింద్ సావంత్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో భారీ పరిశ్రమల శాఖను మరోమంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు అదనపు బాధ్యతలుగా అప్పగించారు.