సాక్షి, అమరావతి : ప్రతిపక్షంగా మంచి సూచనలు చేయాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పలు అంశాలపై టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ చేసిన విమర్శలపై మంత్రి స్పందించారు. ప్రతిపక్షంగా మంచి సూచనలు చేస్తే స్వీకరించడానికి సిద్ధమన్నారు. తమ పాలన ఎలా ఉంటుందో కొంత కాలం వేచి చూడకుండా, రెండు వారాలకే అసహనంతో విమర్శలు చేయడం సరికాదన్నారు. విడిపోయిన రాష్ట్రాన్ని ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చిక్కి శల్యంగా మార్చారని.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను అనారోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తయారు చేశారని తూర్పారబట్టార.
రాజధానిలో శాశ్వత భవనానికి ఒక్క ఇటుక కూడా వేయలేకపోయారని విమర్శించారు. ‘చంద్రబాబు సీఎంగా ఉంటూ కూడా ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిలో ఇల్లు కూడా కట్టుకోకుండా పొరుగు రాష్ట్రంలో కట్టుకున్నారు. వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండి ఇక్కడే ఇల్లు కట్టుకుంటే దానిపై విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవినా అంటూ ప్యాకేజీకి మద్దతుగా సభలో చంద్రబాబు తీర్మానం చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం గొప్పగా పోరాడినట్టు ఇదే సభలో ఎలా చెప్పుకోగలుగుతున్నారు? ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్‌లో ప్రత్యేక హోదా అంశంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎలా మాట్లాడారు.. అంతకు ముందు చంద్రబాబు ఎలా మాట్లాడారో చూసుకోండి. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎమ్మెల్సీలుగా ఉన్న పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలతో రాజీనామా చేయించిన చంద్రబాబు.. ఆయన కొడుకు లోకేష్‌తో మాత్రం ఎందుకు రాజీనామా చేయించలేదు?’ అని బొత్స నిలదీశారు.
విచారణకు భయపడి సీబీఐని రానివ్వలేదు
చంద్రబాబు హయాంలో గడిచిన ఐదేళ్లూ అవినీతి, అక్రమాలే. విచారణకు భయపడి చివరకు సీబీఐని కూడా రాష్ట్రంలోకి రానివ్వకుండా పారిపోయారంటే ఆయన ఎంత అవినీతి పరుడో తెలుస్తోంది. ఆయన కేబినెట్‌లో నాలుగు సంవత్సరాల 8 నెలల పాటు ఒక్క ముస్లింకు కూడా స్థానం లేకుండా చేశారు. ఇలాంటి రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందా? మా పార్టీ బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించినట్టుగానే ఎమ్మెల్యేల నుంచి మంత్రి పదవుల వరకూ సామాజిక న్యాయం పాటించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేష్ అనిపించుకున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించి బాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. చంద్రబాబు అత్యంత స్వార్థపరుడు. అవసరమనుకున్నప్పుడు దగ్గరికి చేర్చుకోవడం, లేదంటే దూరంగా పెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎంతో మంది పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదే. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ద్వారా అందరి బాధలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు వారి సమస్యలను నెరవేర్చుకుంటూ వెళుతున్నారు. మరో 30 ఏళ్లు జగన్‌మోహన్‌రెడ్డే సీఎంగా ఉంటారు.
– శాసనసభలో షేక్ అంజాద్‌బాష, ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి
హోదా కోసం దీక్ష చేస్తేనే బాబు కోప్పడ్డారు..
ప్రత్యేక హోదా బదులుగా కేంద్రం ప్యాకేజీని ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న తాను నిరసన దీక్ష చేసిన తనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ విషయం సభలో ఉన్న లోకేష్‌కు కూడా తెలుసని, కావాలంటే నిజమో కాదో కనుక్కోండని టీడీపీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకుంది చంద్రబాబే అని మంత్రి నారాయణ స్వామి, హోదాపై మొదటి నుంచి మాట మార్చకుండా పోరాడుతున్నది ఒక్క జగన్‌మోహన్‌రెడ్డే అని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
ప్రజలు ఓడించినా... తీరు మారలేదు
చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి
ఏది పడితే అది మాట్లాడిన మీరు ఇప్పుడు హుందాతనం గురించి చెబితే మేం నేర్చుకోవాలా? అని టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరిని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. సోమవారం అసెంబ్లీలో గవర్నరు ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా హుందాతనం పాటించాలని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించగా శ్రీకాంత్‌రెడ్డి జోక్యం చేసుకుని ‘గతంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌ని మగాడివైతే.. అని బుచ్చయ్య చౌదరి అన్నారు. అలాంటి మీరా.. మాకు నీతులు చెప్పేదని శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. ‘ప్రజలు ఇంతగా చక్కటి తీర్పు ఇచ్చినా ఇంకా మీరు మారరా? మీ పాలనలో గుంటూరు ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికాయి. ఎలుకలు పట్టడానికి రూ.8 కోట్లు ఖర్చు పేరుతో మింగేశారు. పోలవరాన్ని సోమవారంగా మార్చామన్నారు. చేసిందేమిటి? ఈ ప్రాజెక్టుకు మొత్తం 24 అనుమతులు కావాల్సి ఉండగా 23 అనుమతులను వైఎస్ సర్కారే తెచ్చింది. ప్రజలు చిత్తుగా ఓడించినా అచ్చెన్నాయుడు ఇంకా మారలేదు. ఇప్పటికైనా సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment