‘సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌’ కేసు ఏమవుతుంది !? | Malegaon blast case trial challenges media freedom | Sakshi
Sakshi News home page

‘సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌’ కేసు ఏమవుతుంది !?

Published Wed, Aug 21 2019 2:11 PM | Last Updated on Wed, Aug 21 2019 2:14 PM

Malegaon blast case trial challenges media freedom - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2008 నాటి మాలేగావ్‌ బాంబు పేలుడు కేసు విచారణను గోప్యంగా నిర్వహించాలని కోరుతూ ఆ కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ: అత్యున్నత యాంటి టెర్రరిస్టు దర్యాప్తు సంస్థ) ఆగస్టు రెండవ తేదీన ముంబైలోని ప్రత్యేక కోర్టుకు ఓ దరఖాస్తు దాఖలు చేసుకొంది. ఇక్కడ కేసును గోప్యంగా విచారించడం అంటే కేసుతో సంబంధం ఉన్న నిందితులు, సాక్షులు, న్యాయవాదులు, అవసరమైన కోర్టు సిబ్బంది మినహా మిగతా ప్రజలు ఎవరూ కోర్టు హాలులో ఉండరాదు. ముఖ్యంగా మీడియాను అనుమతించరాదు. 

ఉత్తర మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008, రంజాన్‌ మాసం ఆఖరి రోజైన సెప్టెంబర్‌ 29వ తేదీన ఓ మసీదు సమీపంలో ఓ మోటారు సైకిల్‌కు అమర్చిన బాంబు పేలడం వల్ల ఆరుగురు మరణించడం, వంద మంది దాకా గాయపడడం తెల్సిందే. బాంబు అమర్చిన మోటార్‌సైకిల్‌ ప్రస్తుతం బీజేపీ లోక్‌సభ సభ్యురాలైన సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ పేరు మీద రిజిస్టర్‌ అయి ఉందని, ముస్లిం టెర్రరిజానికి వ్యతిరేకంగా ఆమె, మరికొంత మంది హిందూత్వ వాదులు కుట్ర పన్ని ఈ ‘హిందూ టెర్రరిజం’కు పాల్పడ్డారని నాడు ఆరోపణలు, వార్తలు వచ్చాయి. దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించే లక్ష్యంతో ప్రజ్ఞాసింగ్‌ మరికొంత మంది తీవ్ర హిందూత్వవాదులు ‘అభినవ్‌ భారత్‌’ అనే సంస్థను కూడా ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. 

మత సామరస్యం, జాతీయ భద్రత, శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొనే ఈ కేసు విచారణను గోప్యంగా నిర్వహించాలని కోరుతున్నట్లు ఎన్‌ఐఏ తన దరఖాస్తులో పేర్కొంది. ఇది కేవలం సాకు మాత్రమేనని, ఇందులో ఏదో మర్మం ఉందని సులభంగానే గ్రహించవచ్చు. అది ఎప్పుడూ నిందితలు పక్షం వహిస్తూ రావడమే అందుకు రుజువు. ఈ కేసులో ఠాకూర్, ఇతర నిందితుల పట్ల మెతక వైఖరి అవలంబించాల్సిందిగా ఎన్‌ఐఏ తనపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు మాజీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రోహిణీ సేలియన్‌ బహిరంగంగా ఆరోపించడం తెల్సిందే. 

ఠాకూర్, ఇతర నిందితులపై చార్జిషీటు నమోదు చేసేందుకు సరైన ఆధారాలు లేనందున వారిని కేసు నుంచి మినహాయించాలని కోరుతూ 2016లో ఎన్‌ఐఏ ఓ అనుబంధ నివేదికను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. గత ఐదేళ్లుగా కేసు దర్యాప్తు జరిపి మీరు తేల్చింది చివరకు ఇదా, కేసు విచారణ కొనసాగాల్సిందేనంటూ ఆ నివేదికను పరిగణలోకి తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించింది. 2011లో ఈ కేసు విచారణను ఎన్‌ఐఏ స్వీకరించిన విషయం తెల్సిందే. అప్పటి వరకు మహారాష్ట్ర యాంటి టెర్రరిజమ్‌ స్క్వాడ్‌ ఈ కేసు విచారణను కొనసాగించింది. 

ఈ కేసులో త్వరలో ప్రాసిక్యూషన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘ఇన్‌ కెమేరా (గోప్యంగా)’లో కేసు విచారణ జరగాలంటూ ఎన్‌ఐఏ దరఖాస్తు చేసుకుంది. కేసు విచారణ సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే నిందిల పట్ల మెతక వైఖరి అవలంబిస్తే అది బయటకు తెలుస్తుందని, సరైన ఆధారాలు చూపకపోతే సంస్థ వైఫల్యం ప్రజలకు, ముఖ్యంగా మీడియాకు తెలుస్తుందనే ఉద్దేశంతోనే ఎన్‌ఐఏ సంస్థ ఈ దరఖాస్తు చేసినట్లు మీడియా అనుమానిస్తోంది. 

అందుకనే కొంత మంది జర్నలిస్టులు కలిసి ఎన్‌ఐఏ దరఖాస్తును సవాల్‌ చేస్తూ ఆగస్టు ఐదవ తేదీన ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. మీడియాను అనుమతించక పోవడం అంటే భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని కూడా వాదించింది. దీనిపై కోర్టు తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. ‘కేసులో న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్లు బయటకు కనిపించాలి’ అంటూ సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో సహజ న్యాయ సూత్రాన్ని ప్రకటించింది. ఆ రకంగానైనా కేసులో బహిరంగ విచారణే కొనసాగించాలి. మరి ప్రజ్ఞాసింగ్‌ కేసులో ఏమవుతుందో చూడాలి!!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement