
మధిర: ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల ముందు ప్రచారం చేసిన సీఎం కేసీఆర్, నాలుగేళ్లలో ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిరలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూసిన యువతకు నిరాశే మిగులుతోందన్నారు. నాలుగేళ్ల బడ్జెట్‌లో నిరుద్యోగులకు ఏమాత్రం నిధులు కేటాయించలేదని విమర్శించారు.
ప్రభుత్వ పరంగా ఉద్యోగాలను సృష్టించడం లేదని, ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదని ధ్వజమెత్తారు. కనీసం ప్రైవేటురంగంలోనూ స్వయం ఉపాధి కల్పించడం లేదని, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు కూడా ఉద్యోగాల కల్పనకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వయోపరిమితి మించి పోతుండడంతో యువత ఆందోళనకు గురవుతోందని అన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులను బెదిరించడం అవివేకమని అన్నారు.