సాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిలా తాను పదవుల కోసం పాకులాడలేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ అన్నారు. శనివారం ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 23 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసమే ఉద్యమిస్తున్నానని, ఈ విషయాన్ని కడియం శ్రీహరి తెలుసుకోవాలన్నారు.
కేసీఆర్ మంత్రివర్గంలో కడియం పాత్ర తగ్గిందని, చిత్తశుద్ధి కోల్పోయారని విమర్శించారు. భారతి సంస్మరణ సభలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనిని చెప్పామని, కానీ మీడియాలో వచ్చే వార్తలను పట్టించుకోకుండా కడియం ఇష్టానుసారంగా మాట్లాడటం తగదన్నారు. బీజేపీతో సిద్ధాంతపరంగా వైరుధ్యమున్న సీపీఐకి అపాయింట్‌మెంట్ ఇస్తున్న ప్రధాన మంత్రి.. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రాసిన లేఖను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు.
అపాయింట్‌మెంట్ అంశంపై టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నించాలన్నారు. వర్గీకరణ కోసం 30 రోజులు దీక్షలు చేస్తే టీఆర్‌ఎస్ ఎందుకు మద్దతివ్వలేదని ఆయన ప్రశ్నించారు. దీక్షకు మద్దతిస్తామంటే తమ వేదికను మార్చుకుంటామని, ఈ అంశంపై కడియం శ్రీహరి 24 గంటల్లో స్పష్టం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ తమపై కక్ష పెంచుకున్నారని, తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే కేసులు పెట్టారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment