
నక్సల్స్ ప్రాబల్యమున్న ఛత్తీస్‌గఢ్‌లో మొదటిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఎన్నికలు బహిష్కరించాలనే నక్సల్స్ హెచ్చరిక, బహిష్కరణ బెదిరింపు పనిచేయకూడదన్న ప్రభుత్వ పట్టుదల మధ్య ఈ నెల12న తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయుధ బలగాలను దించడంతో రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్ధితులు ఏర్పడ్డాయి. ఎన్నికలనగానే ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి ఉద్రిక్తతలు సాధరణమయ్యాయి. ఈ సారి కూడా ఎన్నికల వేళ హింస పెచ్చరిల్లవచ్చుననే భయాందోళనలు మిన్నంటాయి. ఇందుకు తగ్గట్లే ఇటీవల బీజాపూర్, సుక్మా జిల్లాల్లో తొమ్మిదిమంది భద్రతా సిబ్బంది, డీడీ న్యూస్ కెమెరామన్‌ను నక్సల్స్ హతమార్చారు. దీంతో ప్రభుత్వం ఎన్నికలు ముగిసే వరకు పలు ప్రాంతాల్లో హై సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించింది.
త్రిముఖ పోటీ..
ఛత్తీస్‌గఢ్ తొలిదశ ఎన్నికల్లో ఎనిమిది మావోయిస్ట్ ప్రభావిత జిల్లాల్లోని 18 నియోజకవర్గాలు (ఎస్టీ–12,ఎస్సీ–1, జనరల్–5) పోలింగ్‌కు సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో ఈ 18 సీట్లలో 12 చోట్ల బీజేపీ ఓటమి పాలైంది. ఈసారి ప్రధానపార్టీలతో పాటు అజిత్ జోగికి చెందిన జేసీసీ–జే కూడా పోటీలో ఉండడంతో పలు ప్రాంతాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జేసీసీ–జె) పార్టీని ఏర్పాటు చేసిన మాజీ సీఎం అజిత్‌జోగి బీఎస్‌పీ, సీపీఐతో పొత్తు పెట్టుకున్నారు. బిలాస్‌పూర్ జిల్లాలోని మార్వావి స్థానం నుంచి జోగి పోటీచేస్తున్నారు. జోగి భార్య రేణుజోగికి కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో ఇప్పుడు జేసీసీ టికెట్‌పై ఇదే జిల్లాలోని కోట (రెండో విడత పోలింగ్) నుంచి పోటీచేస్తున్నారు. వరుసగా మూడుసార్లు సీఎంగా కొనసాగుతున్న రమణ్‌సింగ్‌తో పాటు మొత్తం 190 మంది మొదటి విడత ఎన్నికల బరిలో ఉన్నారు. రాజ్‌నంద్‌గావ్ నుంచి సీఎం రమణ్‌సింగ్‌పై మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి సమీప బంధువు కరుణాశుక్లా (కాంగ్రెస్) పోటీచేస్తున్నారు. ఈ స్థానంలో మొత్తం 30 మంది, బస్తర్, కొండగావ్ స్థానాల నుంచి ఐదేసి మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దంతేవాడ (ఎస్టీ) సీటు నుంచి నక్సల్స్ చేతుల్లో హతమైన కాంగ్రెస్‌నేత మహేంద్రకర్మ భార్య దేవతీ కర్మ (కాంగ్రెస్) పోటీలో ఉన్నారు.
50 డ్రోన్లు.. వెయ్యి ట్రాకర్లు..
నక్సల్స్ హెచ్చరికల నేపథ్యంలో 86 ప్రాంతాల్లోని 187 పోలింగ్‌బూత్‌లను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నారు. ఈ కారణంగా ఓటర్లు కనీసం పది కి.మీ దూరం నడిచివెళ్లి ఓటేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దేశంలోని మరే రాష్ట్రంలో జరగని విధంగా భద్రతా కారణాల దృష్ట్యా రోడ్డుకు పక్కనే తాత్కాలిక పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. నక్సల్స్ ప్రభావం అత్యధికంగా ఉన్న బస్తర్ ప్రాంతంలో మొత్తం 50 డ్రోన్ కెమెరాలు, వెయ్యికి పైగా శాటిలైట్ ట్రాకర్లు ఏర్పాటు చేస్తున్నారు. 50 డ్రోన్ కెమెరాల్లో దంతేవాడలో 25, మిగతా వాటిని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో ఉపయోగిస్తున్నారు. భద్రతా శిబిరాలకు సమీపంగా నక్సల్స్ కదలికలపై నిఘాకు వీటిని వినియోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను పోలింగ్ బూత్‌లకు తీసుకెళ్లే పోలింగ్ సిబ్బందికి వెయ్యికిపైగా శాటిలైట్ ట్రాకర్లు అందుబాటులోకి తెచ్చారు. ఏదైనా జరగరానిది జరిగితే హెచ్చరించే విధంగా ట్రాకర్ల ద్వారా జిల్లా కేంద్రానికి సమాచారం అందేలా మీటలు ఏర్పాటుచేశారు. దీంతో పాటు ఇప్పటికే పోలీసు బలగాల మోహరింపు కూడా మొదలైంది.
50కి పైగా కేంద్రాల్లో జీరో పోలింగ్...
ఎన్నికలను బహిష్కరించాలని ఓటర్లను హెచ్చరిస్తూ మారుమూల ప్రాంతాల్లో నక్సల్స్ కరపత్రాలు పంచుతున్నారు. భేజీ, నీలావయ వంటి సుదూర ప్రాంతాల్లో ఎన్నికల బహిష్కరణ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు కనిపిస్తున్నాయి. 2013 శాసనసభ ఎన్నికల్లో బీజాపుర్, దంతేవాడ, సుక్మా జిల్లాల్లోని 53 పోలింగ్‌బూత్‌లలో ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పోల్‌కాలేదు. ఇలా ఒక్క ఓట్ కూడా పడని జీరో బూత్‌లు బీజాపుర్‌లో 32, సుక్మాలో 15, దంతేవాడలో ఆరు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో జీరో పోలింగ్ బూత్ ఒక్కటి కూడా ఉండకూడదన్న పట్టుదలతో అధికారులున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోవచ్చని, నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాల్లో కేవలం 0–10 శాతం మధ్య పోలింగ్ నమోదు కావొచ్చునని నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఓటింగ్ పెంచేందుకు పలు చర్యలు చేపట్టింది. తమ తల్లితండ్రులు ఓటేసినట్లు ఆధారాలను సమర్పించాలని సుక్మా ప్రాంతంలోని స్కూల్ పిల్లలను టీచర్లు ఆదేశించారు. ఈ ఎన్నికల్లో తప్పక ఓటు వేయాలంటూ దంతేవాడలో మహిళ స్వయంసహాయక బృందాల సభ్యులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఓటింగ్‌ను బట్టి ఈ బృందాలకు ప్రోత్సాహకాలుంటాయని స్థానిక అధికారులు ప్రకటించారు.
పేలవ ఓటింగ్
- సుక్మా జిల్లా కుంట స్థానంలోని భేజీ–2 పోలింగ్‌బూత్‌లో మొత్తం 413 ఓట్లకు గాను 2013 అసెంబ్లీ ఎన్నికల్లో జీరో పోలింగ్ నమోదు కాగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ముగ్గురు మాత్రమే ఓటేసారు.
- నీలావయ పోలింగ్‌బూత్‌లో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 702 ఓట్లకుగాను ఆరు ఓట్లు, 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 753 ఓట్లకు గాను మూడు ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
ఎన్నికలు జరిగే స్థానాలు...
మావోల ప్రభావం ఎక్కువగా ఉన్న బస్తర్, కంకేర్, సుక్మా, బీజాపూర్, దంతేవాడ, కొండగావ్ తదితర జిల్లాల్లోని అనంతగర్, భానుప్రతాప్‌పూర్, కంకేర్, కొండగావ్, నారాయణ్‌పూర్, బస్తర్, జగ్దల్‌పుర్, కేష్‌కల్, చిత్రకూట్, దంతేవాడ, బీజాపూర్, కుంట, ఖైరాగఢ్, డోంగర్‌గఢ్, రాజ్‌నంద్‌గావ్, డొంగర్‌గావ్, ఖుజ్జి, మొహ్లమన్‌పుర్ (మొత్తం 18) .
ప్రధాన అభ్యర్థులు...
బీజేపీ: సీఏం రమణ్‌సింగ్, మంత్రులు మహేష్‌గజ్డ (బీజాపూర్), కేదార్ కశ్యప్ (నారాయణ్‌పూర్)
కాంగ్రెస్: అసెంబ్లీలో విపక్ష ఉపనేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే కవాసి లక్మా(కుంట)తో పాటు లఖేశ్వర్ భాఘేల్ (బస్తర్),దీపక్ కుమార్ బైజీ(చిత్రకూట్), దేవతి కర్మ (దంతేవాడ), సంత్రం నేతం (కేష్‌కాల్)
ఇతరులు: కుంట సీటు నుంచి సీపీఐ మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజం.
Comments
Please login to add a commentAdd a comment