సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేని అడ్డుపెట్టుకుని తమిళనాడులో వేళ్లూనుకోవాలని భారతీయ జనతా పార్టీ తహతహలాడుతోంది. తామేం తక్కువ తిన్నామా అంటూ డీఎంకేని ఎరగా వేసి కాంగ్రెస్ పార్టీ సైతం ఎదగాలని ఆశపడుతోంది. పార్టీ సత్తా చూపేందుకు పార్లమెంటు ఎన్నికలే సరైన తరుణం కావడంతో టీఎన్‌సీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించేశారు. ముఠాలు, వర్గ కుమ్ములాటకు నిలయమైన కాంగ్రెస్‌కు తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లుగా కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, పార్టీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, తాజా మాజీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తయారయ్యారు. ఎన్నికల సమయంలో ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదని తలంచిన రాహుల్‌గాంధీ వీరందరిని కట్టడి చేసే వ్యక్తి ఎవరా అని ఆలోచించారు.
కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాల్లోకి ఇటీవలే ప్రవేశం చేసిన తన సోదరి ప్రియాంక అయితే బెటర్ అని ఆలోచిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ముకుల్‌వాస్నిక్‌ను తప్పించి ఆ స్థానంలో ప్రియాంకను నియమించాలని గట్టిగా భావిస్తున్నట్లు ఢిల్లీ సమాచారం. ప్రధాన కార్యదర్శిగా ఆమె దేశంలోని బీహార్, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు ఆమెపై ఉన్నాయని ఇటీవల ఢిల్లీ మీడియాతో రాహుల్ సూచనప్రాయంగా అన్నారు. అంటే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా దాదాపు ఆమె పేరు ఖరారైందని భావించవచ్చు.
తిరునావుక్కరసర్ తిరుగుబాటు బావుటా
ఇటీవలి వరకు టీఎన్‌సీసీ అధ్యక్షునిగా వ్యవహరించిన తిరునావుక్కరసర్ తనను అకస్మాత్తుగా తొలగించడంపై లోలోన రగిలిపోతున్నారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ స్థానంలో సుమారు ఏడాదిన్నర క్రితం తిరునావుక్కరసర్ నియమితులయ్యారు. తన అనుచరులకు పార్టీలో ప్రాధాన్యత కల్పించలేదని మాజీ అధ్యక్షుడు ఇళంగోవన్, తిరునావుక్కరసర్‌తో విభేదించారు. ఇటీవల ఎంజీ రామచంద్రన్ జయంతిన సత్యమూర్తి (కాంగ్రెస్) భవన్‌లో నిర్వహించడంతో అసంతృప్తివాదులంతా ఏకమై దాదాపు తిరుగుబాటు చేశారు. దీనికి తోడు ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌తో ఎన్నికల నేపథ్యంలో పొత్తు గురించి చర్చలు జరిపినట్లు ప్రచారం జరగడంతో మరింత ఆగ్రహోద్రులైనారు.
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న దశలో తిరునావుక్కరసర్‌ను వెంటనే తొలగించి కొత్త వ్యక్తిని నియమించాలని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ లేదా తిరునావుక్కరసర్ నాయకత్వంలో పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఎన్నికలు ముగిసేవరకు తానే అధ్యక్షుడినని ఇటీవల జరిగిన ఒక కాంగ్రెస్ సమావేశంలో తిరునావుక్కరసర్ ప్రకటించుకోవడం అసంతృప్తవాదులను మరింత రెచ్చగొట్టింది. ఎన్నికల వేళ దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన రాహుల్‌గాంధీ తమిళనాడు పార్టీలోని శిరోభారాన్ని వెంటనే దించుకోవాలని భావించారు.
తిరునావుక్కరసర్‌ను ఢిల్లీకి పిలిపించుకుని జాతీయస్థాయిలో పదవి ఇస్తామని సముదాయించారు. ఆయన సమ్మతితోనే కొత్త అ«ధ్యక్షునిగా కేఎస్ అళగిరిని నియమించారు. అధిష్టానం తీసుకున్న ఈ ఆకస్మిక చర్య తిరునావుక్కరసర్ అనుచరులకు ఆగ్రహం తెప్పించింది. సంస్థాగత ఎన్నికల ద్వారా ఎన్నికైన 25 మంది జిల్లా పార్టీ కార్యదర్శులను తొలగించరాదని తిరునావుక్కరసర్ అధిష్టానాన్ని కోరారు. రెండురోజుల క్రితం ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీని కలుసుకున్న ఆయన మంగళవారం సాయంత్రం చెన్నైకి చేరుకున్నారు. తమిళనాడులోని కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్లిరావడం షరా మామూలే. అయితే అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన తరువాత ఢిల్లీ నుంచి తొలిసారిగా చెన్నైకి వస్తున్న సమయంలో తిరునావుక్కరసర్‌కు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. తద్వారా బలప్రదర్శన చేశారు. ఆ తరువాత చెన్నై అన్నానగర్‌లోని తన నివాసంలో అనుచరులతో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. భవిష్యత్ కార్యక్రమాలపై ఆయన అంతర్గత చర్చలు చేసినట్లు సమాచారం.
8న అళగిరి బాధ్యతల స్వీకరణ
టీఎన్‌సీసీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన కేఎస్ అళగిరి ఈనెల 8వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్‌లో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment