ఒకటికి ఒకటి కలిస్తే రెండు అని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. గణితంలో ఈ లెక్క కరెక్టే కావచ్చు కానీ రాజకీయాల్లో కాదు. ఇటీవల తెలంగాణ ఎన్నికలు రుజువు చేసిందిదే.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి అన్నీ ఒక్కటై మహా కూటమిగా ఏర్పడ్డా.. ఆయా పార్టీలకు గతంలో ఓటేసిన వాళ్లందరూ మళ్లీ వేయలేదు. దీంతో కాగితాలపై మాత్రమే బలంగా కనిపించే పొత్తులు వాస్తవంలో ఏమవుతాయో తెలియదు. సార్వత్రిక ఎన్నికల వేళ జాతీయ స్థాయిలో ఇలాంటి పొత్తులను ఒక్కసారి చూస్తే..
దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు బువా – భతీజా (అత్తాఅల్లుడు).. అదేనండి సమాజ్‌వాదీ పార్టీ యువనేత అఖిలేశ్ యాదవ్.. బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి జట్టుకట్టి ఎన్నికల బరిలోకి దిగారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 21.8 శాతం ఓట్లతో 47 సీట్లు గెలుచుకుంది. బీఎస్పీ 22.2 శాతం ఓట్లు తెచ్చుకున్నా.. వచ్చిన సీట్లు 19 మాత్రమే. అప్పట్లో ఇరు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. భారతీయ జనతా పార్టీ ఆ ఎన్నికల్లో ఏకంగా 300 సీట్లు గెలిచి అధికారం చేపట్టింది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ–ఎస్పీ జట్టు కట్టాయి. గత ఎన్నికల్లో తమకు వచ్చిన ఓట్లు (21.8 + 22.2) మొత్తం ఉమ్మడి అభ్యర్థికి పడతాయన్నది పొత్తు వెనుక ఉన్న ఉద్దేశం కానీ.. ‘పోలింగ్ రోజు’ ఇలాంటివేవీ పనిచేయవని చరిత్ర చెబుతోంది. ఓట్ల బదలాయింపు పూర్తిస్థాయిలో జరగాలంటే లెక్కలేసుకుంటే సరిపోదు.. ఇరు పార్టీల ఓటర్ల మధ్య కెమిస్ట్రీ కుదరాలన్నది, ఓట్లు ఒకరి నుంచి ఇంకొరికి బదిలీ కావాలన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
కెమిస్ట్రీ కోసం తంటాలు
ఉన్న 80 సీట్లలో ఎస్పీ 37 స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీఎస్పీ 38 స్థానాల్లో బరిలో నిలవనుంది. పొత్తు కుదిరినప్పటి నుంచి ఇరు పార్టీల కార్యకర్తలు కెమిస్ట్రీ పండించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎస్పీ వాళ్లు తాము సాధారణంగా చేసే నినాదాలకు జై భీమ్, జై కాన్షీరామ్ జోడిస్తే.. బీఎస్పీ వాళ్లు లోహియా గళం ఎత్తుకుంటున్నారు. ఇక, ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన పొత్తు ఎంత వరకు పండుతుందనేది చూస్తే.. ఇరవై ఏళ్లుగా బద్ధ శత్రువులుగా ఉన్న ఇరు పార్టీలు ఈసారి జట్టు కట్టినంత మాత్రాన కార్యకర్తలు, మద్దతుదారులందరూ ఒకేవైపునకు మొగ్గు చూపుతారన్నది కల్లే. 1985లో మాయావతిపై సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు కొందరు దాడులు చేయడంతో మొదలైన శత్రుత్వం తొందరగా మరచిపోయేది కాదన్నది కొందరి అభిప్రాయం. నాయకత్వం మాత్రం గతం గతః అన్నట్టుగా ముందుకెళ్లాలని సూచిస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉండగా యాదవులు తమను చాలా ఇబ్బందుల పాల్జేశారని అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా మాయావతి దళితుల దృష్టిలో కొంత చులకనయ్యారని కొంతమంది కార్యకర్తలు చెబుతున్నారు.
అప్పటి మాదిరిగానే పని చేస్తుందా?
ఎస్పీ, బీఎస్పీ మధ్య కెమిస్ట్రీపై కొంతమంది పెదవి విరుస్తున్నా.. ఒకప్పుడు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్, ఎస్పీ నేత ములాయం కలిసికట్టుగా పనిచేసినట్టే ఈసారీ ఇరు పార్టీ సభ్యులు ఒక్కతాటిపై పనిచేస్తారని కొందరి విశ్లేషణ. బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత ఆ రెండు పార్టీలు జట్టు కడితే.. పెద్దనోట్ల రద్దు ప్రభావం వల్ల ఇప్పుడు వారిద్దరూ కలిసి పనిచేస్తారని అంచనా. పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని ఆగ్రా ప్రాంతంలోని చెప్పుల తయారీ దుకాణాలు బోలెడన్ని మూతపడ్డాయి. పెద్దనోట్ల రద్దుతో నష్టపోయిన వారిలో ఎక్కువ మంది దళితులు, ఓబీసీలే కావడం గమనార్హం. మాయావతి పాలన.. ప్రస్తుత యోగీ –మోదీ పాలన కంటే ఎంతో మెరుగ్గా ఉండిందని.. కాబట్టి ఈసారి ‘బువా – భతీజా’ జోడీకి తిరుగులేదన్నది కొందరు యాదవుల అంచనా. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ కూటమికి మంచి ఆదరణే ఉంటుందని నగరాల విషయం చెప్పలేమని వీరంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment