
మాట్లాడుతున్న ఆదినారాయణరెడ్డి
పోరుమామిళ్ల: పోరుమామిళ్లలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గం ప్రత్యేకహోదా పేరుతో నిర్వహించిన బైక్ ర్యాలీ బలప్రదర్శనను తలపించింది. పార్టీలోని ప్రత్యర్థి వర్గాన్ని సవాల్ చేస్తూ చేసిన ర్యాలీగా కనిపించిందే తప్ప హోదా కోసం చేసినట్లు లేదని స్థానికంగా చర్చ నడుస్తోంది. బద్వేలు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి విజయమ్మ వర్గీయుడు రంతుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కమ్మవారిపల్లెకు చెందిన టీడీపీ నాయకులు రెండ్రోజుల క్రితం పట్టణంలో ర్యాలీ నిర్వహించి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాసు (శ్రీనివాసులరెడ్డి) దిష్టిబొమ్మ దహనం చేయడం, విజయమ్మ పార్టీ నుంచి బయటకుపోతేనే బద్వేలులో పార్టీ బతుకుతుందని నినదించడం, మంత్రులు ఆది, సోమిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన నేపథ్యంలో విజయమ్మ వర్గం హోదా పేరుతో ర్యాలీ నిర్వహించి తమ బలం చూపింది. శుక్రవారం జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే జయరాములు, పార్టీ బద్వేలు ఇన్‌చార్జి విజయజ్యోతి పాల్గొనలేదు. ఎమ్మెల్యే పోరుమామిళ్లలోనే ఉన్నా ఆయనకు సమాచారం లేదు. జ్యోతికి కూడా సమాచారం లేదని తెలిసింది.
క్రమశిక్షణ తప్పితే ఊరుకోం
ఆర్టీసీ బస్టాండు వద్ద జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ తప్పి వ్యవహరిస్తే తోక కట్ చేస్తామని పరోక్షంగా కమ్మవారిపల్లె టీడీపీ వర్గీయులకు హెచ్చరిక చేశారు. పదవి రాలేదనే అక్కసుతో ఇష్టారాజ్యంగా మాట్లాడటం, పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీలు చేయడాన్ని సహించబోమన్నారు. మంత్రి ఆది మాట్లాడుతూ విజయమ్మ ఎవరికి బొట్టుపెడితే వారికే ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్నారు. విజయజ్యోతి కూడా విజయమ్మ వద్దకు వస్తేనే టికెట్ వస్తుందని, లేకపోతే రాదన్నారు. విజయమ్మ నాయకత్వంలోనే బద్వేలులో పార్టీ నడుస్తుందన్నారు. విజయజ్యోతి గోడ పక్క నుంచి పుల్లలు పెడుతుందన్నారు. ఎమ్మెల్యేకు విజయమ్మతో కలసిపోవాలని చెప్పామని, ఈ ర్యాలీకి ఆహ్వానించినా రాలేదన్నారు. వాసు, ఆది ఇద్దరూ అసలు ప్రత్యేకహోదా అంశాన్ని పక్కనపెట్టి పార్టీలో అసమ్మతి వర్గీయులపై, వైఎస్సార్‌సీపీపై అక్కసు వెళ్లగక్కారు. ఆఖరుకు విజయమ్మ కూడా బద్వేలులో పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నానని, అందరినీ కలుపుకొని పోతున్నానని, ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదని పేర్కొన్నారు తప్పితే హోదా విషయం పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. శుక్రవారం ర్యాలీలో విజయమ్మ వర్గీయులు మాత్రమే భారీగా బైకులపై కనిపించారు.