సాక్షి, విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కురుసాల కన్నబాబు అన్నారు. కాపు నేస్తంపై పవన్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాపులను మోసం చేసిన చంద్రబాబు నాయుడును ఆయన ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. మంత్రి కన్నబాబు శనివారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కుల ప్రస్తావన లేకుండా పవన్ రాజకీయాలు చేయలేకపోతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
‘కాపులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. కాపు నేస్తం పథకం కింద మహిళలకు ఆర్థిక సాయం చేశాం. ఏడాది కాలంలో కాపులకు రూ.4,769 కోట్లు ఆర్ధిక సాయం చేశాం. మంచి చేస్తున్న ప్రభుత్వంపై పవన్‌కు ఎందుకంత ఉక్రోషం. ఓర్వలేనితనంతోనే అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. గతంలో కాపుల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే చంద్రబాబు అణచివేశారు.
ఉద్యమంలో పాల్గొన్న మహిళలను బూతుల తిట్టడమే కాకుండా వారిపై కేసులు పెట్టారు.కాపు రిజర్వేషన్ల కోసం ఉద‍్యమం చేసిన ముద్రగడ్డ పద్మనాభం, ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు సర్కార్ అవమానించినప్పుడు పవన్ ఎక్కడున్నారు?. చంద్రబాబు హయాంలో పవన్‌కు కళ్లు కనిపించలేదు. చంద్రబాబు పట్ల తన ప్రేమను దాచుకోలేకపోతున్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. కాపు సామాజిక వర్గానికి ఎవరు మేలు చేశారో ఇప్పటికైనా పవన్ తెలుసుకోవాలి’ అని హితవు పలికారు. (‘కాపులను చంద్రబాబు గాలికి వదిలేశారు’)
కాగా కాపు కార్పొరేషన్‌కు ఇప్పటివరకూ ఏ బడ్జెట్‌లో ఎంత కేటాయించారు..ఎంత ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మరోవైపు కాపులకు ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ పవన్ విమర్శలకు దిగారు. అయితే ఆయన విమర్శలను మంత్రి కన్నబాబు తిప్పికొట్టారు. ఇప్పటికైనా పవన్ తన తీరు మార్చుకోవాలని సూచించారు. కాపు నేస్తం అద్భుతమైన పథకమని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. (‘కాపు’ కాసిన దేవుడు ! )
Comments
Please login to add a commentAdd a comment