సాక్షి, విజయవాడ : గోశాలలో పెద్దసంఖ్యలో గోవులు మృతి చెందటం వెనుక కుట్రకోణం దాగి ఉందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కొత్తూరు తాడేపల్లిలో భారీ సంఖ్యలో ఆవులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజాసింగ్, ఎమ్మెల్సీ మాధవ్ సోమవారం గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘పచ్చగడ్డిలో ఏదైనా కెమికల్స్ కలిశాయి అంటున్నారు. అలాగే జరిగింది అనుకుంటే ఒకటో, పదో ఆవులు చనిపోవచ్చు.. కానీ వంద ఆవులు ఎలా చనిపోతాయి’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని... ఇందుకు కారణమైన కుట్రదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గోవులపై విషప్రయోగం జరిగిందని తేలితే సహించేది లేదని తేల్చిచెప్పారు. గోమాతను ప్రేమిస్తాను కాబట్టే గోవుల మరణవార్త విని ఇక్కడికి వచ్చానన్నారు.
ఈ ఘటనపై ఎమ్మెల్సీ మాధవ్ స్పందిస్తూ.. గోశాలలో 100కు పైగా గోవులు మృతి చెందటంపై విచారం వ్యక్తం చేశారు. విషప్రయోగం జరిగింది కాబట్టే భారీ సంఖ్యలో గోవులు చనిపోయాయని ఆరోపించారు. గోవుల మృతిపై పోలీసులు, వెటర్నరీ, ఫోరెన్సిక్ అధికారులు సంయుక్తంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాంతి హోమం జరిపితే మంచిదని సూచించారు. కాగా గో సంరక్షణ ప్రాంతంలో అత్యంత ఖరీదైన సంపద దాగి ఉందని పేర్కొన్నారు. గోశాలలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
చదవండి: గోవుల మృత్యు ఘోష
Comments
Please login to add a commentAdd a comment