పట్నంబజారు(గుంటూరు): ‘నేను సవాల్ చేస్తున్నా.. నారా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. నాపై చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధమా? నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకొంటా.. మరి మీరేం చేస్తారో చెప్పండి.. నా సవాల్‌ను స్వీకరించే దమ్ముందా?’ అంటూ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఉద్వేగభరితంగా మాట్లాడారు. చంద్రబాబు, ప్రత్తిపాటి చేసిన ఆరోపణలు నిరూపించకుంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. పిల్లి కోటి అనే వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు, ప్రత్తిపాటిలు నీచరాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు.
ఎమ్మెల్యేగా తాను బరిలోకి దిగే సమయం నుంచి కోటి వ్యవహరించిన తీరు తనను మానసికంగా ఇబ్బందికి గురిచేసిందన్నారు. తనపై, తన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూనే ఉన్నాడని.. అతని చేష్టలు శృతిమించడంతో తమ పార్టీ కార్యకర్తలు పోలీసులకు íఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కాలని చంద్రబాబు చూస్తున్నారని.. అందుకే బీసీ మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అన్యాయానికి అండగా నిలబడుతున్నారని మండిపడ్డారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో చంద్రబాబుకు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. జిల్లాలో ముగ్గురు మహిళలకు సీట్లిచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది అయితే.. ఒక్క సీటు కూడా ఇవ్వని చంద్రబాబుకు మహిళలపై ఉన్న గౌరవమేంటో తెలుస్తోందన్నారు. అనంతరం పిల్లి కోటి పెట్టిన పోస్టింగ్, అనుచిత వ్యాఖ్యలను మీడియాకు చూపారు.
Comments
Please login to add a commentAdd a comment