
ఎంపీడీఓను ఫోన్లో నిలదీస్తున్న ఎమ్మెల్యే రోజా
పుత్తూరు: అధికార పార్టీ నాయకులు బరితెగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వైపు చూస్తే చాలు శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. గత నెలలో నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తొరూరు పంచాయతీలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆనంబట్టులో ఇంటింటికీ వైఎస్సార్ కుటుంబం నిర్వహించి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. గ్రామం మొత్తం ఆమెకు బ్రహ్మరథం పట్టడాన్ని స్థానిక టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. గ్రామంలో వైఎస్సార్‌సీపీ జెండాను పీకేయడంతో పాటు, ఇంటింటికీ అతికించిన వైఎస్సార్‌సీపీ స్టిక్కర్లను తొలగించాల్సిందేనని..లేదంటే అంతవరకు పింఛన్ల పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యే ఆర్‌కే రోజా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారనే అక్కసుతో ఇద్దరు సంఘమిత్రలను పింఛన్ల పంపిణీ విధుల నుంచి తొలగించారు.
ఎంపీడీఓపె రోజా సీరియస్..
దీనిపై ఎమ్మెల్యే రోజా మంగళవారం ఎంపీడీఓ నిర్మలాదేవికి ఫోన్‌చేసి విషయాన్ని ప్రస్తావించారు. ఎంపీడీఓ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవారిని ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోనని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అనంతరం ఎంపీడీఓ నేరుగా వచ్చి ఎమ్మెల్యేకు సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. అందుకు ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగేళ్లుగా రాని ఫిర్యాదులు ఇప్పుడు ఎలా వచ్చాయని నిలదీశారు. విచారణకు తొరూరుకు వచ్చేందుకు సిద్ధమేనా ? అని నిలదీయగా ఎంపీడీఓ నీళ్లు నమిలారు. తొలగించిన సంఘమిత్రలను తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే ఎంపీడీఓగా మీపై వచ్చిన ఆరోపణలపై నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment