సాక్షి, అమరావతి : రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు ఐదేళ్లు చంద్రబాబు నాయుడుకి సమయం ఇచ్చినా ఉపయోగించుకోలేపోయారని వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే విడదల రజనీ విమర్శించారు. శాసనమండలి రద్దుపై సోమవారం అసెంబ్లీలో చర్చలో భాగంగా ఆమె ప్రసంగించారు. మండలిపై చంద్రబాబు తొలినుంచి రెండు నాల్కల సిద్ధాంతంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే చంద్రబాబుకు శాసనమండలి బంగారుబాతులా కనిపించిందని, కాంట్రాక్టర్లు, కార్పొరేటర్లు, వ్యాపారవేత్తలకు ఎమ్మెల్సీ సీట్లు అమ్ముకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యనమల రామకృష్ణుడు ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని రజనీ విమర్శించారు. మండలిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వాన్ని హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. (మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్)
నారా లోకేష్‌కు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన పెద్దల సభను.. తక్కువ చేసి మట్లాడం సరికాదని హితవుపలికారు. ప్రజల అవసరాలకు ఏమాత్రం ఉపయోగంలేని మండలిని రద్దు చేస్తామంటే పెద్దల సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ స్వాగతించారని సభలో తెలిపారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తామంతా స్వాగతిస్తున్నామని రజనీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment