
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక కోసం మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈనెల 28 వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఉంటుంది. 29న నామినేషన్ల పరిశీలన, 31న ఉపసం హరణ ప్రక్రియ పూర్తవుతాయి. అవసరమైతే జూన్ 7న పోలింగ్ జరగనుంది. అదేరోజు ఫలితాలను వెల్లడిస్తారు. అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు భారీ ఆధిక్యత ఉన్న నేపథ్యంలో ఏకగ్రీవంగానే ఈ ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేయడంతో డిసెంబర్‌లో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఆరునెలలలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో కేం ద్ర ఎన్నికల సంఘం ఎన్నిక ప్రక్రియను చేపట్టింది. ఎన్నిక జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్ రెండుమూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. లోక్‌సభ ఫలితాల తర్వా త పరిణామాలను బట్టి అభ్యర్థిని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.