
డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : అగ్రిగోల్డ్ సంస్థ కుంభకోణం వ్యవహారంలో తెలంగాణ సర్కార్ ఉదాసీన వైఖరి సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘంతో కలిసి ఆయన బుధవారం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిశారు. రాష్ట్రంలోని 2 లక్షల 65 వేల మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలంటే ఆ సంస్థ చైర్మన్, డెరెక్టర్లను వెంటనే అరెస్టు చేయాలని డీజీపీని కోరారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ కుంభకోణంలో రూ. 500 కోట్లకు పైగా మోసపోయిన డిపాజిటర్ల పక్షాన నిలవాలని సుధాకర్ రెడ్డి తెలంగాణ సర్కార్‌ను డిమాండ్ చేశారు. సంస్థ నిర్వాహకులపై కేసులు పెట్టాలనీ, ఏపీ ప్రభుత్వం తరహాలో కఠినంగా వ్యవహరించి రాష్ట్రంలో గల ఆ సంస్థ ఆస్తులను జప్తు చేయాలన్నారు. తెలంగాణలోని అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను ఏపీ సర్కార్ జప్తు చేస్తుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేసీఆర్ తక్షణమే ఈ వ్యవహారంపై చొరవ తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సుధాకర్ రెడ్డి అన్నారు.