మోదీ ప్రభ తగ్గుతోంది  | Modi appeal is declining -mp kavitha | Sakshi
Sakshi News home page

మోదీ ప్రభ తగ్గుతోంది 

Published Sun, Apr 7 2019 4:12 AM | Last Updated on Sun, Apr 7 2019 4:12 AM

Modi appeal is declining -mp kavitha - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జాతీయ రాజకీయాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభ తగ్గుతోందని ఎంపీ, నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి విజన్‌ లేని నాయకత్వం ఉందని, ఇన్నాళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ రెండు పార్టీలు దేశానికి దశ, దిశ చూపలేకపోయాయని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో జరిగిన కమ్మ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో కవిత ప్రసంగించారు. ‘‘ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి.. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్‌లే ప్రాంతీయ పార్టీలకు వెనకుండి మద్దతిచ్చే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి.. దేశంలో జరిగే నిర్ణయాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది.. తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలుపుతున్న టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు మద్దతు పలకాలి..’అని విజ్ఞప్తి చేశారు. 

ఆంధ్రాకు ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ మద్దతు  
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ప్రజలు నిరంతరం బాగుండాలని కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కవిత పేర్కొన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయమై మన్మోహన్‌ సింగ్‌ అడిగినప్పుడు కేసీఆర్‌ మద్దతు తెలిపిన విషయం మీకందరికీ తెలిసిందేనని చెప్పారు. ఎంపీగా ఐదేళ్లలో తాను నియోజకవర్గ అంశాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో శక్తి మేరకు పనిచేశానని, మరోసారి అవకాశం కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 

రైతుబంధుతో భూముల ధరలు పెరిగాయి 
రాష్ట్రంలో రైతాంగానికి టీఆర్‌ఎస్‌ సర్కారు అండగా నిలుస్తోందని, రైతుబంధు పథకం అమలు చేసిన నాటి నుంచి భూములు విక్రయించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, దీంతో భూముల ధరలు పెరిగాయని కవిత వ్యాఖ్యానించారు. రైతుకు సంపూర్ణ భద్రత రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. రైతులు టీఆర్‌ఎస్‌ పక్షాన ఉండాలని విజ్ఞప్తి చేశారు. ‘‘కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాకుండా, రైతుల సంక్షేమం కోసం కేసీఆర్‌ ఓ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారని తెలిపారు. మూడేళ్ల క్రితం నుంచి భూ రికార్డుల ప్రక్షాళన, పట్టాదారు పాసుపుస్తకాల జారీ వంటి ప్రక్రియలకు శ్రీకారం చుట్టిన అనంతరం రైతుబంధు పథకాన్ని అమలు చేశారన్నారు. ఎన్నికలు వస్తున్నాయని అదే కేంద్ర ప్రభుత్వం రైతుబంధు పేరు మార్చి అమలు చేసిందని చెప్పారు. వ్యవసాయానికి ఉచితంగా నిరంతర విద్యుత్‌ సరఫరా.. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోదాముల నిర్మాణం చేపట్టిందని చెప్పారు. క్రాప్‌ కాలనీలు ఏర్పాటు చేసి మార్కెట్‌కు అనుగుణంగా రైతుల ఉత్పత్తులకు మద్దతు దక్కేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కవిత వివరించారు.  

వ్యవసాయానికి ‘ఉపాధి’కోసం పార్లమెంట్‌లో ప్రస్తావించా  
ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అనేక పర్యాయాలు తాను పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రం దృష్టికి తీసుకొచ్చానని.. అయినా ఫలితం లేకుండా పోయిందని కవిత వాపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో సింగూరు నీటిని హైదరాబాద్‌కు తరలించడంతో నిజాంసాగర్‌ ఆయకట్టు ఎండిపోయిందని, శాశ్వత పరిష్కారం కోసం పసుపువాగు కాళేశ్వరం నీటిని నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు తరలించడం ద్వారా 365 రోజులు ఆయకట్టుకు నీరందేలా పనులు జరుగుతున్నాయని అన్నారు. సమావేశంలో బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అమేర్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement