సాక్షి,బెంగళూరు: ‘‘కర్ణాటకలో సిద్దరా మయ్య ప్రభుత్వం ఉందని కొందరు అనుకుంటున్నారు. కానీ, ఇక్కడ నడిచేది ‘సీదా రూపయ్యా సర్కారు’ అని ప్రజలు భావిస్తున్నారు’’ అని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఇక్కడ డబ్బు లేనిదే ఏ పనీ జరగదనీ, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఇలాంటి ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీలు లేదని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప 75వ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం దావణగెరెలో నిర్వహించిన భారీ సభలో ఆయన మాట్లాడారు.
ఎలాంటి మేలూ చేయని సిద్దరామయ్య ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఈ ప్రభుత్వం ఢిల్లీ పెద్దలను సంతృప్తి పరచటం, అసంతృప్త నాయకులకు వసూళ్లలో వాటాలివ్వటం అనే రెండు పనులను మాత్రం చేస్తోందని దుయ్యబట్టారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్సే కారణమని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు, మంత్రుల ఇళ్లపై జరిగిన ఐటీ దాడుల్లో బయటపడిన బంగారం, డబ్బుల కట్టలు ఎవరి సొమ్మని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు జరిగిన కార్యక్రమాల్లో సిద్దరామయ్య ప్రభుత్వాన్ని పది శాతం కమీషన్ ప్రభుత్వం అని విమర్శించిన ప్రధాని.. ఆ సమాచారం తప్పని,, అవినీతి అంతకుమించి ఉంటుందని తెలిసిందని అన్నారు. ఈ వ్యవహారం కర్ణాటకలో అందరికీ తెలుసన్నారు. స్వచ్ఛ భారత్, వాటర్‌షెడ్, స్మార్టు సిటీల కోసం కేంద్రం ఇస్తున్న వేలాది కోట్ల నిధులను ప్రభుత్వం వినియోగించుకోవటం లేదన్నారు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకునే బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. త్వరలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సీఎం అభ్యర్థిగా బలమైన లింగాయత్ వర్గానికి చెందిన యడ్యూరప్పను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. మంగళవారం యడ్యూరప్ప పుట్టినరోజు కూడా కావటం గమనార్హం. కాగా, రాష్ట్రంలో ప్రధాని పర్యటన ఈ నెలలో ఇది మూడోది.
Comments
Please login to add a commentAdd a comment