
భోపాల్: మాజీ ప్రధానిరాజీవ్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ఆరోపణలు అరాచకంగా ఉంటున్నాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌నేత కమల్‌నాథ్ అన్నారు. ‘ఇటీవలి కాలంలో మోదీ మాటలు చూస్తుంటే ఒకటి అర్థమవుతున్నది. మోదీ కోపంగా ఉన్నారు. గుజరాత్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్లే సమయం వచ్చిందని ఆయనకు తెలుస్తోంది’అని కమల్‌నాథ్ పేర్కొన్నారు. పీటీఐకి ఆయన గురువారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘మోదీ తన స్థాయి ని మర్చిపోవడం బాధాకరం. ఆయన ఆరోపణలు చేస్తున్న విధానం అరాచకం. మోదీ ఇప్పుడు యువత గురించి, రైతుల గురించి, వ్యాపారుల గురించి మా ట్లాడటం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు’అని కమల్‌నాథ్ అన్నా రు. గత శనివారం మోదీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాపగఢ్ జిల్లాలో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఓ అవినీతిపరుడిగా పేరుమోసి చనిపోయారని అన్నారు. మోదీ భవిష్యత్తు గురించి కమల్‌నాథ్‌ను అడగ్గా, ‘ఒక్కటైతే కచ్చితంగా చెప్పగలను. మోదీ ఇంటికి (గుజరాత్‌కు) తిరిగి వెళ్లనున్నారు’ అని అన్నారు. భోపాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్‌పై బీజేపీ తరఫున ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పోటీ చేస్తుండటంపై కమల్‌నాథ్ మాట్లాడుతూ ‘భోపాల్‌లో బీజేపీకి అభ్యర్థులే లేరు. అందుకే పార్టీలో చేరిన మరుసటి రోజే ప్రజ్ఞతో వారు నామినేషన్ వేయించారు. ఆమెను తమ అభ్యర్థిగా నిలపడం ద్వారా, హిందూత్వ రాజకీయాలు చేసి, ప్రజల మధ్య చిచ్చుపెట్టాలన్నదే తమ లక్ష్యమనే సందేశాన్ని బీజేపీ ఇచ్చింది’అని విమర్శించారు.
మా ఉమ్మడి లక్ష్యం బీజేపీ ఓటమి..
మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన లోకేంద్ర సింగ్ రాజ్‌పుత్, నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున బీఎస్పీ తరఫున పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆ నియోజకవర్గంలో బీఎస్పీకి అభ్యర్థే లేకుండాపోగా, కాంగ్రెస్ తరఫున జ్యోతిరాదిత్య సింధియా పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతుండటం తెలిసిందే. తమ అభ్యర్థి కాంగ్రెస్ లో చేరడంతో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి హెచ్చరించారు. ‘ఆ అభ్యర్థి కాంగ్రెస్‌లో చేరాలనుకున్నాడు. కాంగ్రెస్, బీఎస్పీల ఉమ్మడి లక్ష్యం బీజేపీని ఓడించటం. బీజేపీకి లాభం చేకూర్చేలా మాయావతి ఏమీ చేయరని నా నమ్మకం’ కమల్ నాథ్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 లోక్‌సభ స్థానాలకుగాను కాంగ్రెస్ 22 సీట్లు గెలుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment