
సాక్షి, అమరావతి : రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వికేంద్రీకరణ బిల్లు తీసువచ్చారని మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. రూల్ 71పై గురువారం చర్చలో భాగంగా అసెంబ్లీలో మోపిదేవి మాట్లాడారు. శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లును శాసనమండలి చర్చించి, ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. సాంప్రదాయాన్ని పక్కనపెట్టి అప్పటికప్పుడు కుట్రపూరితంగా రూల్ 71ను తెచ్చి రోజంతా మండలిని స్తంభింపజేశారని మండిపడ్డారు. చర్చ ముగిసే సమయంలో దురుద్దేశపూర్వకంగానే సెలెక్ట్ కమిటీ అంశాన్ని ప్రస్తావించారని అసహనం వ్యక్తం చేశారు. (విచక్షణాధికారం ఉందని సభను రద్దు చేస్తారా?)
బుధవారం మండలిలో జరిగిన సంఘటనలు చాలా బాధాకరమని మోపిదేవి అన్నారు. టీడీపీ సభ్యులు మండలిని వారి పార్టీ కార్యాలయంగా ఉపయోగించుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు ఎప్పుడు జరగలేదని టీడీపీ సభ్యులు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి మండలి, అసెంబ్లీ ఆమోదించిన ప్రధాన బిల్లును మండలి అడ్డుకోవడం అనేది చాలా ప్రమాదకరమైన హెచ్చరికలాంటిదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు సీఎం వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తామంతా స్వాగతిస్తామని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు.