దళితతేజం పేరుతో చంద్రబాబు మరో దగా | Mothkupally Narsimhulu fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

దళితతేజం పేరుతో చంద్రబాబు మరో దగా

Published Sun, Jul 1 2018 4:39 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

Mothkupally Narsimhulu fires on CM Chandrababu - Sakshi

హైదరాబాద్‌: దళిత తేజం పేరుతో పేద వర్గాలను మరోసారి మోసం చేయాలని చంద్రబాబు పన్నాగం పన్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ బహిషృత నేత మోత్కుపల్లి నర్సింహులు దుయ్యబట్టారు. శనివారం ఆయన హైదరాబాదులో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు. దళితులకు క్షమాపణ చెప్పిన తర్వాతే దళితతేజం సభలో మాట్లాడాలని ఆయన డిమాండ్‌ చేశారు. దళితులను అడుగడుగునా అణగదొక్కిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన గుర్తు చేశారు. మహనీయుడు ఎన్టీఆర్‌ చెప్పినట్లు నీచుడు చంద్రబాబు రాజకీయాల్లో ఉండకూడదు. ఈ చీడపురుగును రాజకీయాల నుంచి తప్పించే అవకాశం వచ్చింది.. ఈ అవకాశం వదులుకోవద్దని ఆంధ్ర ప్రజలకు పిలుపు ఇస్తున్నానన్నారు. ప్రజలతో పాటు దేవదేవుడైనా వెంకటేశ్వర స్వామిని కూడా మొక్కుకుంటానన్నారు.

ఇందుకోసం జూలై 11న తిరుమలకు నడిచివెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానన్నారు. దుర్మార్గుడైన చంద్రబాబు కబంధ హస్తాల నుంచి ప్రజలను కాపాడాలని కోరతానన్నారు. చంద్రబాబు, ఆయన మనుషుల వల్ల తనకు ప్రాణహాని ఉందని, అయినా చంద్రబాబుకు రాజకీయ సమాధి చేసేందుకు తాను ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. అది నీ జెండా కాదు... నందమూరి జెండా అని మళ్లీమళ్లీ చెబుతున్నా... దాన్ని మోసే అర్హత నీకు లేదని చంద్రబాబును హెచ్చరించారు. అమాయకమైన దళిత వర్గాలను ఆయన ప్రయోజనం కోసం విడగొట్టి, వాడుకుని పబ్బం గడుపుకున్న చంద్రబాబుకు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. మరోసారి దళితులను మభ్యపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబును నమ్మరని, పాతరేస్తారని హెచ్చరించారు.

పేదలకు వెయ్యి రూపాయలు పెన్సన్‌ ఇచ్చి ఎంతో చేశామని చెబుతూ ఇష్టారాజ్యంగా వందల కోట్ల ప్రజా సొమ్ము ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నారు.. ప్రజలేమైనా బిచ్చగాళ్లా అని ప్రశ్నించారు. రూ.3000 వేలు పెన్షన్‌ ఇస్తానంటున్న వైఎస్‌ జగన్‌ను అభినందిస్తున్నానన్నారు.  ఒక్కో నియోజకవర్గానికి 25 కోట్లు ఖర్చు చేస్తానంటున్నాడు... అది అంతా మీ సొమ్మే తీసుకోండి... ఓటు మాత్రం ఆయనకు వేయద్దు.. జగన్‌కు వేయండి.. లేదంటే మరెవరికైనా వేయండి అని మోత్కుపల్లి ఏపీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. చంద్రబాబుకు మతి మరుపు రోగం వచ్చింది... అందుకే ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చమని అడిగితే తిడుతున్నారని, ఇప్పటికే తెలంగాణ వాళ్లు తరిమేశారు.. త్వరలో ఆంధ్ర ప్రజలు కూడా తన్ని తరిమేస్తారని హెచ్చరించారు. నాలుగేళ్లు బీజేపీతో అధికారంలో అన్నీ అనుభవించిన చంద్రబాబుకు ఈ రోజు హోదా గురించే మాట్లాడే అర్హతలేదన్నారు. అసలు ఆంధ్రప్రజల గురించి మాట్లాడే అర్హతే లేదని దుయ్యబట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement