నా ప్రాణాలకు ముప్పు ఉంది: మోత్కుపల్లి | Motkupalli Narasimhulu Slams AP CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

నా ప్రాణాలకు ముప్పు ఉంది: మోత్కుపల్లి

Published Sat, Jun 30 2018 1:37 PM | Last Updated on Sat, Jun 30 2018 3:16 PM

Motkupalli Narasimhulu Slams AP CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీని ఏపీ సీఎం చంద్రబాబు సర్వనాశనాలకు నిలయంగా మార్చారని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తక్కువ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని అని మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆలోచనా విధానాలను చంద్రబాబు అణగదొక్కుతున్నారని విమర్శించారు. దళిత తేజం పేరుతో దళితుల ఓట్ల కోసం గ్రామాల్లో తిరుగుతున్నారని, దళితులను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. నెల్లూరు దళిత తేజం సభలో దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. ముద్దు కృష్ణమనాయుడిని తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు చంద్రబాబు వాడుకున్నారని, కానీ సీఎం అయ్యాక గాలికొదిలేశారని విమర్శించారు. నేనేంటో చంద్రబాబుకు తెలుసు. దారినపోయే దానయ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబుకు గుణపాఠం చెప్పాల్సిన ఏ అవకాశాన్ని వదులుకోవద్దని కోరుతున్నాను. చంద్రబాబు ముఖం చూసి ఓటేసిన వాళ్లు లేరు. 

చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుతా..
జూలై 11వ తేదీన నా జన్మదినం. ఆ రోజున తిరుపతి వెళ్తా. చంద్రబాబు ఓడిపోవాలని వెంకన్నకు మొక్కుతా. చంద్రబాబు దళితుల ద్రోహి. సీఎం రమేష్‌లా దీక్ష చేస్తే ఏడాదిపాటు చేయొచ్చు. 11 రోజులైనా అలసిపోకుండా సీఎం రమేష్‌ దీక్ష చేస్తున్నాడు. దొంగ దీక్ష చేస్తున్నాడు కాబట్టే.. టీడీపీ ఎంపీలు చులకనగా మాట్లాడారు. ఉక్కు రాదు.. తుక్కు రాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి కరెక్ట్‌గా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు ఘోరీ కట్టడం ఖాయం. చంద్రబాబు మోసగాళ్లకే మోసగాడు. చంద్రబాబు ఓడిపోతే నాకు అన్ని పదవులు వచ్చినట్లే. చంద్రబాబుకు తప్పకుండా దళితుల ఉసురు తగులుతుందన్నారు. చంద్రబాబు ఏనాడు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని అడగలేదు. హోదా కావాలని అడిగే నైతికహక్కు చంద్రబాబు కోల్పోయారు. హోదా కోసం పోరాడుతుంది వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, వామపక్షాలు.

నా 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబులాంటి నీచ రాజకీయ నేతలను చూడలేదు. చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని దివంగత నేత ఎన్టీఆర్‌ ఎప్పుడో చెప్పారు. టీడీపీలో చంద్రబాబు కంటే నేనే సీనియర్‌. చంద్రబాబు హృదయం లేదని బండరాయి. నేను ఏడిస్తే ఒక్కసారైనా వచ్చి ఓదార్చారా.. ? నన్ను విజయసాయిరెడ్డి సహా అన్ని పార్టీల వాళ్లు ఓదార్చారు. చంద్రబాబుకు ధైర్యముంటే కేసులన్నింటినీ రీ ఓపెన్‌ చేసుకోవాలి. చంద్రబాబు దొరకని దొంగ అంటూ తీవ్రస్థాయిలో ఏపీ సీఎంపై మోత్కుపల్లి విమర్శలు చేశారు.

మాల-మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చు..
రాజకీయాల్లో చంద్రబాబులాంటి చీడపురుగులను తరిమేయాలని వెంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నా. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్‌ కూడా రాదు. ప్రజల డబ్బును భోగభాగ్యాల కోసం వాడుకుంటున్నావ్‌. చంద్రబాబు నన్ను మానసికంగా చంపేశాడు. చంద్రబాబుకు మతిమరుపు, పిచ్చి రోగం వచ్చింది. సీఎంగా ఉండే అర్హత ఆయనకు లేదు. చంద్రబాబును ఓడించాలని ఎన్టీఆర్‌గారి కోరికతో పాటు నా కోరిక కూడా. గుమ్మి కింద పందికొక్కుల్లాగా రాష్ట్రాన్ని తండ్రీకొడుకులు దోచుకుతింటున్నారు. పెద్ద మాదిగను అని చెప్పుకుని ఏబీసీడీ వర్గీకరణ చేస్తానని చెప్పి ఎమ్మార్పీఎస్‌ జెండా కప్పుకున్నా కూడా విభజన ఎందుకు చేయలేదు. ఒకసారి మాలను అంటావు.. మరోసారి మాదిగనంటావు. మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టావ్‌. నాయీ బ్రాహ్మణులపై మీరు ఎందుకు కక్షకట్టారు. వాళ్లు చేసిన పనిలో వచ్చిన ఆదాయంలో 25 శాతం ఎందుకివ్వవు. బీసీలు జడ్జీలుగా పనికిరారని రిపోర్ట్‌లు పంపిస్తావ్‌. రాజకీయ అవసరాలకు వాడుకుని ఎవరినీ ఎదగనీయని వ్యక్తి చంద్రబాబు. 

చంద్రబాబును వదిలిపెట్టేది లేదు
వెయ్యి రూపాయల పెన్షన్‌ ఇచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. చంద్రబాబు 100 రూపాయల పనిచేసి వెయ్యి రూపాయల ప్రచారం చేసుకుంటున్నారు. దళితులను పార్టీలోంచి తీసేస్తున్నారు. చింతమనేని మహిళా ఎమ్మార్వోను కొట్టినా చర్యలు లేదు. వేలకోట్ల రూపాయాల ఇసుక అక్రమ రవాణా చేసినా చింతమనేనిని చంద్రబాబు ఏమనరు. మాలమాదిగలు ఉద్యమాలు చేస్తే గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది. తప్పు చేయకున్నా తనను పార్టీకి దూరం చేసిన దొంగ చంద్రబాబు. ఆయన దళిత తేజం కాదు.. దళితులకు వ్యతిరేకంగా ఆలోచిస్తూ దొంగమాటలు మాట్లాడే వ్యక్తి చంద్రబాబు. నన్ను బహిష్కరించే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారు. చంద్రబాబును వదిలిపెట్టేది లేదు. నువ్వు, ఈన కొడుకూ తప్ప రాష్ట్రంలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా. గతంలో తెలంగాణ ప్రజలు చంద్రబాబును తన్ని తరిమేశారు. ఇప్పుడు ఏపీ ప్రజలు తన్ని తరియేయడానికి సిద్ధంగా ఉన్నారు. దళితులను దుర్భాషలాడిన ఆదినారాయణరెడ్డిని తక్షణమే కేబినెట్‌ నుంచి తొలగించాలని’ మోత్కుపల్లి డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement