
సాక్షి, హైదరాబాద్: కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళనలు నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్‌సభలో, రాజ్యసభలో ఏపీకి జరిగిన అన్యాయంపై గళమెత్తారు. అధికార టీడీపీ ఎంపీలు కూడా ఉభయసభల్లో ఆందోళన చేసినప్పటికీ.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనతో మెత్తబడ్డారు. జైట్లీ ప్రకటన తర్వాత వెనక్కితగ్గి టీడీపీ ఎంపీలు ఆందోళన విరమించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాత్రం రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు పోరాడుతూనే ఉంటామని, తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
పార్లమెంటు ఉభయసభల్లో ఏపీ ఎంపీలు జరిపిన ఈ ఆందోళనలో కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కనిపించకపోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఎంపీలు ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో చిరంజీవి కనిపించకపోవడం, నిరసనలో పాల్గొనకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ సమయంలో చిరంజీవి ఎక్కడ ఉన్నారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే విషయమై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ట్విటర్‌లో స్పందించారు. ఎంపీ కొణిదెల చిరంజీవి కనిపించుట లేదని కత్తి మహేశ్ ట్వీట్ చేశారు.