సీఎం కేసీఆర్‌ ముల్లాలా తయారయ్యాడు: అర్వింద్‌ | MP Dharmapuri Arvind Slams On CM KCR In Nizamabad | Sakshi
Sakshi News home page

ఈ నెలలోనే పసుపుబోర్డు 

Jan 6 2020 9:15 AM | Updated on Jan 6 2020 9:19 AM

MP Dharmapuri Arvind Slams On CM KCR In Nizamabad - Sakshi

సాక్షి, భీమ్‌గల్‌(నిజామాబాద్‌): పసుపుబోర్డు ఏర్పాటు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, ఈ నెలలోనే పసుపుబోర్డు తెస్తామని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పేర్కొన్నారు. బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఫైల్‌ రెడీ అయ్యిందని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్‌ఆర్‌సీకి మద్దతుగా ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో భీమ్‌గల్‌ శివారులోని ఎల్‌జే ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఎంపీ ప్రసంగించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం ఎంపీగా గెలిచినప్పటి నుంచి పసుపుబోర్డు సాధన కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. 

బీజేపీకి రైతుల మీదే ప్రేమ..
పసుపుబోర్డు లేదా అంత కంటే మెరుగైనది మంజూరు చేయాలని తాను కేంద్రాన్ని కోరుతూనే ఉన్నానని చెప్పారు. అయితే, ఇప్పుడు ఫైల్‌ తయారైందని, ఈ నెలలోనే ప్రకటన వస్తుందని వెల్లడించారు. ఇందుకోసం రెండు పెద్ద వేర్‌ హౌస్‌లు, కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు. తనను ఢిల్లీకి రమ్మని పిలుపు వచ్చిందని, పసుపుబోర్డు కోసం మున్సిపల్‌ ఎన్నికలను వదిలి ఢిల్లీకి వెళ్తున్నానని వివరించారు. బీజేపీకి ఎన్నికల మీద ప్రేమ లేదని, రైతుల మీద మాత్రమే ప్రేమ ఉందన్నారు. 

జగన్‌కు ఉన్న సోయి కూడా లేదు.. 
సీఎం కేసీఆర్‌ పెద్ద ముల్లాలా తయారయ్యాడని ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. పసుపుబోర్డు ఏర్పాటు చేయమని కేంద్రానికి లేఖ రాయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా ఖాతరు చేయలేదని ధ్వజమెత్తారు. అదే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పసుపు పంటకు మద్దతు ధర నిర్ణయించడంతో పాటు కేంద్ర సాయం కోరాడని తెలిపారు. మన సీఎం కేసీఆర్‌కు మాత్రం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికున్న సోయి కూడా లేదని విమర్శించారు. 

డిపోను తెరిపించని మంత్రి.. 
బాల్కొండ నియోజకవర్గానికి చెందిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇక్కడ అభివృద్ధి శూన్యమని ఎంపీ ఆరోపించారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న ప్రశాంత్‌రెడ్డి.. ఎన్నికల హామీ అయిన భీమ్‌గల్‌ బస్‌డిపోను తెరిపించలేక పోయాడన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా ఉండి రోడ్లు కూడా బాగు చేయించలేదని, భీమ్‌గల్‌కు రెండేళ్ల క్రితం ఉన్న రోడ్లే ఉన్నాయన్నారు. ప్రజలు పనులడుగుతే పైసలు లేవంటున్నాడని ఎద్దేవా చేశారు. భీమ్‌గల్‌ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయినా కవిత మింగుడు తగ్గలేదని విమర్శించారు. కేంద్ర నిధులన్నీ కాళేశ్వరం, మిషన్‌ భగీరథకు వెచ్చిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం నుంచి నిధులు రావని, అన్నీ కేంద్ర నిధులే వస్తాయని అందుకే బీజేపీకి ఓటేసి పట్టం గట్టాలని పిలుపునిచ్చారు. గల్లీ నుండే రామరాజ్య స్థాపన మొదలవ్వాలన్నారు. బీజేపీ నేతలు మల్లికార్జున్‌రెడ్డి, బస్వా లక్ష్మీనర్సయ్య, రుయ్యాడి రాజేశ్వర్, పిల్లోల్ల గంగాస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement