
సాక్షి, కాకినాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ రాశారు. కాపులకు బీసీ రిజర్వేషన్‌ను రెండు నెలల్లో అమలుచేస్తామని కాకినాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు మీడియాకు తెలిపారని, ఈ మేరకు డిసెంబర్ 6వ తేదీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తీపికబురు చెప్పాలని ఆయన గుర్తుచేశారు.
కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించే రోజు వస్తుంది కనుకనే బీసీ నేతలతో తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయిస్తున్నారని, తమకు రిజర్వేషన్ ఇస్తే బీసీలు రాజకీయంగా నష్టపోతారని వారితో చంద్రబాబు చెప్పిస్తున్నారని ముద్రగడ మండిపడ్డారు. అన్ని వర్గాలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత మిలిగిన 51శాతంలో తమ జనాభాను బట్టి కొంత శాతం, అది పేదవారికి రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరారు. భవిష్యత్తులో తగదాలు రాకుండా తమకు కల్పించే రిజర్వేషన్‌లో ఏబీసీడీ వర్గీకరణ ఉండాలని పేర్కొన్నారు.