
సాక్షి, అమరావతి: తన ఓటు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఆధార్ కార్డు లేనివాళ్లు నంది అవార్డుల గురించి హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడుతున్నారని తాను వ్యాఖ్యానించిన నేపథ్యంలో కొందరు తన కుటుంబానికి ఏపీలో ఆధార్, ఓటర్ కార్డు ఉందో లేదోనని వెతుకుతున్నారని చెప్పారు. మంత్రి భూమా అఖిలప్రియను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారనే వార్తల్లో నిజం లేదన్నారు.
మంత్రివర్గ విస్తరణ చేపట్టే ఆలోచన గానీ.. కనీసం చర్చ గానీ పార్టీలో లేదన్నారు. అఖిలప్రియ బాగా పని చేస్తున్నారని, విశాఖలో జరిగిన బెలూన్ ఫెస్టివల్, సోషల్ మీడియా అవార్డ్స్ ఫంక్షన్‌ను ఆమె బాగా నిర్వహించారని చెప్పారు. కృష్ణానదిలో పవిత్ర సంగమం వద్ద బోటు ప్రమాదానికి కారణమైన వారిని వదిలేది లేదన్నారు. కాగా, నంది అవార్డుల గురించి లోకేశ్ సోమవారం చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై స్పందించకుండా లోకేశ్ మీడియాకు మొహం చాటేశారు. శాసనమండలి సమావేశం నుంచి నేరుగా తనకు కేటాయించిన గదిలోకి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment