తాడేపల్లి రూరల్: ఎన్నికల ప్రచారంలో తొలిరోజే మంత్రి లోకేష్ తన అధికార దర్పాన్ని ప్రదర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో యథేచ్ఛగా కోడ్‌ను ఉల్లంఘించినా అధికారులు పట్టించుకోలేదు. మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్‌ను అధికారికంగా ప్రకటించినప్పటినుంచి మంగళగిరి నియోజకవర్గంలో నిరసనలు మొదలయ్యాయి. తొలిరోజు చిర్రావూరు నుంచి ప్రచారాన్ని ప్రారంభించేందుకు లోకేష్ గుండిమెడ గ్రామానికి వెళ్లారు. టీడీపీ నాయకులు స్వాగతం పలికి, పక్కనే ఉన్న శ్రీవేణుగోపాలస్వామి, కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానంలోకి తీసుకువెళ్లారు. లోకేష్ భద్రతా సిబ్బంది గుడి ప్రధాన ద్వారాన్ని మూసివేసి, ఎవ్వరినీ లోనికి రానీయకుండా అడ్డుకోవడంతో అక్కడకు వచ్చిన సామాన్యులు, కార్యకర్తలు విస్తుపోయారు.
లోకేష్ రాకను పురస్కరించుకొని తాడేపల్లి మండలంలోని గుండిమెడ, చిర్రావూరు గ్రామాల్లో పచ్చతోరణాలను ఏర్పాటు చేయడంతో పాటు, యథేచ్ఛగా రోడ్ల వెంబడి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జెండా దిమ్మలకు ఉన్న ముసుగులను తొలగించి, పార్టీ జెండాలను పైకి ఎగురవేసి ఉంచడం విశేషం. ఇంత జరుగుతున్నా పోలీసులు కానీ, ఎన్నికల అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. నియోజకవర్గ ఎన్నికల అధికారిణి మాసూమాబేగంకు పలువురు ఫోన్ చేసి చెప్పినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చిర్రావూరు, గుండిమెడ గ్రామాల్లో పెట్టిన ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలపై ఎన్నికల అధికారిణి మాసూమాబేగంను ‘సాక్షి’ వివరణ అడగ్గా పరిశీలిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment