
దేవరాపల్లి (మాడుగుల) : ‘చినబాబు’ మళ్లీ నాలుక మడతెట్టేశారు. ప్రతి సభలో, సమావేశంలో ఏదో అంశంపై తప్పులు మాట్లాడుతూ ప్రజలకు వినోదాన్ని పంచుతున్న మంత్రి నారా లోకేష్.. తనదైన శైలి ప్రసంగంలో మరో మారు తడబడి ‘పప్పు’లో కాలేశారు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ.. విశాఖ ఎయిర్‌పోర్టుకు బదులుగా ‘వైకాపా ఎయిర్‌పోర్టు’గా ప్రస్తావిస్తూ ప్రసంగించడంతో సభకు హాజరైన టీడీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు నవ్వుకున్నారు. మాడుగుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి గవిరెడ్డి రామానాయుడు, అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి ఆడారి ఆనంద్‌కు మద్దతుగా చేపట్టిన ప్రచార సభలో టీడీపీ పాలనపై ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన లోకేష్.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్న ఘటనను హేళన చేస్తూ ప్రసంగించబోయి విశాఖ విమానాశ్రయాన్ని ‘వైకాపా ఎయిర్‌పోర్టు’గా పేర్కొనడంతో సదస్సుకు హాజరైన సొంత పార్టీ కార్యకర్తలే ఫక్కున నవ్వుకుంటూ కామెడీ చేశారు.
కాగా, దేవరాపల్లిలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభకు కొద్దిపాటి జనాన్ని తరలించేందుకు తమ్ముళ్లు నానా అవస్థలు పడ్డారు. మహిళలకు రూ. 300, మగవారికి రూ.300 డబ్బు, మద్యం బాటిల్ ఇచ్చి బలవంతంగా సభకు తీసుకువచ్చారు. వెరసి తెలుగు తమ్ముళ్లతో దేవరాపల్లి మండలంలో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి.( చదవండి : లోకేశ్‌తో నెటిజన్ల హోలీ ఆట )
దేవరాపల్లి టీడీపీ సభకు వస్తూ మార్గ మధ్యంలో మద్యం సేవిస్తున్న టీడీపీ నాయకులు
పాడేరులో జనం లేక లోకేష్ సభ వెలవెల
పాడేరు : విశాఖపట్నం జిల్లా పాడేరులో సీఎం చంద్రబాబునాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్న టీడీపీ ఎన్నికల ప్రచార సభ జనం లేక వెలవెలబోయింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పాడేరులో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల ప్రచార సభను తలపెట్టారు. అయితే సభా ప్రాంగణం మొత్తం పచ్చ చొక్కాలతో వచ్చిన టీడీపీ శ్రేణులు తప్ప జనం కనిపించలేదు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లడుతూ.. పాడేరు అసెంబ్లీ అభ్యర్ధి గిడ్డి ఈశ్వరి, అరకు పార్లమెంట్ అభ్యర్థి కిశోర్ చంద్రదేవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరగా జనం నుంచి స్పందన రాలేదు. ( చదవండి : నోరు జారిన లోకేశ్.. ఆర్కే సెటైర్!)