
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ దేశీయంగా అధికార కార్యక్రమాల కోసమే కాకుండా అనధికార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానాలను ఎక్కువగా ఉపయోగిస్తారన్నది తెల్సిందే. అధికారక కార్యక్రమాల కోసం విమానాలను ఉపయోగించినప్పుడు వాటికయ్యే ఖర్చును పీఎంవో కార్యాలయం నేరుగా చెల్లిస్తుంది. అనధికార కార్యక్రమాలకు హాజరైనప్పుడు సంబంధిత పార్టీలు పీఎంవో కార్యాలయం ద్వారా ఆ ఖర్చులను చెల్లించాలి. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ అనధికార కార్యక్రమాలకు హాజరవడం అంటే పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లడమే. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడం, అందుకోసం ఆయన భారత వైమానికి దళానికి (ఐఏఎఫ్)కు చెందిన ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడం తెల్సిందే.
నరేంద్ర మోదీ దేశీయంగా పర్యటించేందుకు ఎక్కువగా లగ్జరీ కేటగిరీకి చెందిన బీబీజీ (బోయింగ్ బిజినెస్ జెట్), ఎంఐ–17 (వీవీఐపీ) హెలికాప్టర్‌లను ఎక్కువగా ఉపయోగించారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 2019, జనవరి 31వ తేదీ వరకు 240 అనధికార పర్యటనలకు తమ విమానాలను ఉపయోగించారని, అందుకైన మొత్తం 1.4 కోట్ల రూపాయలను పీఎంవో కార్యాలయం ద్వారా బీజేపీ చెల్లించిందని సమాచార హక్కు కింద భారత వైమానిక దళం వెల్లడించింది. ఆ చిట్టాపద్దులను చూస్తే ఎవరైనా కళ్లు తిరగి కిందపడాల్సిందే. చిల్లరకొట్టు చిత్తు పద్దుకన్నా అధ్వాన్నంగా ఉందది. వెళ్లిన డేట్ పేరు, రూటు పేరు, వసూలు చేసిన ఛార్జీల మొత్తం మినహా మరేమి లేదు. కేంద్ర రక్షణ శాఖ నిర్దేశించిన ఐఏఎఫ్ నిబంధనల ప్రకారం ఒక్కో విమానానికి ఒక్కో ఫ్లైయింగ్ అవర్ రేట్ ఉంటుంది. ప్రధాని ఏ రోజున ఏ రకమైన విమానం ఎక్కారు ? ఎంత దూరం ప్రయాణించారు ? అది ఒక ట్రిప్పా లేదా రెండు ట్రిప్పులా? అసలు ఆ రోజున ఎన్ని ఫ్లైయింగ్ అవర్స్ అయ్యాయో, ఒక్క ఫ్లైయింగ్ అవర్‌కు ఎన్ని లక్షల రూపాయలో అన్ని వివరాలు విధిగా ఉండాలి. అవేవి లేవు.
అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వేర్వేరు ఆరు రోజుల్లో ప్రధాని ఎక్కడెక్కడ ప్రయాణించారో పేర్కొంటూ ఆ ఆరు రోజులకు కలిపి 3,64,795 రూపాయలు చార్జీలు వసూలు చేసినట్లు ఐఏఎఫ్ పేర్కొంది. రక్షణ మంత్రిత్వశాఖ–ఏర్ ఇండియా ప్రధాని కార్యాలయం (2018, మార్చి నెలలో) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రధాని మోదీ బీబీజే విమానాన్ని ఉపయోగించినట్లయితే గంట ఫ్లైయింగ్ అవర్‌కీ రికవరీ రేటు 14,77,000 రూపాయలు. అదే ఎంఐజీ–17 వీవీఐపీ హెలికాప్టర్‌ను ఉపయోగించినట్లయితే గంట ఫ్లైయింగ్ రికవరీ రేట్ 4,30,000 రూపాయలు. అంటే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆరు రోజుల్లో ప్రయాణించినది ఒక్క ఫ్లయింగ్ అవర్ కూడా కాదన్నమాట! ఎంతటి దిగ్భ్రాంతి.
ఈ ఫ్లయింగ్ రేట్‌లు కమర్షియల్ విమాన సర్వీసులు లేని ప్రాంతాలకే వర్తిస్థాయి. కమర్షియల్ విమాన సర్వీసులున్న ప్రాంతాల్లో ఓ చోటుకి వెళ్లాలంటే ఓ ప్రయాణికుడికి విమానంలో ఎంత ఖర్చవుతుందో ప్రధాని అనధికార పర్యటనకు అంత రికవరీ చేయాలి. ఓ ప్రయాణికుడు చండీగఢ్ నుంచి సిమ్లాకు వెళ్లాలంటే ఓ ప్రయాణికుడికి విమానం టెక్కెట్ 2,500 నుంచి ఐదు వేల (వన్‌వే టిక్కెట్) రూపాయల వరకు ఉంది. 2017, ఏప్రిల్ 27వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చండీగఢ్ నుంచి సిమ్లా వెళ్లి, అక్కడి నుంచి అన్నాడలే వెళ్లి చండీగఢ్‌కు వచ్చినందుకు ఇండియన్ ఏర్‌ఫోర్స్ కేవలం 845 రూపాయలను రికవరీ ఛార్జీగా వసూలు చేసింది. మామూలు క్యాబ్ ఛార్జీలే కాదు, ఆటో ఛార్జీలకన్నా విమాన చార్జీలు తక్కువన్న మాట. ఇలాంటి వింతలు ఇంకా ఎన్నో 2019, జనవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ ‘హెచ్‌పీ బాలంగిర్ నుంచి హెచ్‌పీ పఠాన్‌చెరాకు కేవలం 744 రూపాయల చార్జీలను వసూలు చేశారు.
కొన్ని రూట్లలో నరేంద్ర మోదీ వెళ్లినప్పుడు ఓ రేటును, వచ్చేటప్పుడు మరో రేటును చార్జ్ చేశారు. నరేంద్ర మోదీ చాలా సార్లు తన అధికార పర్యటనలతో తన అనధికార పర్యటనలను కూడా కలిపారు. వాటికి ఎలాంటి చార్జీలను బీజేపీ నుంచి వసూలు చేయలేదు. మొత్తానికి మోదీ 240 ట్రిప్పులకు కోటీ నలభై లక్షల రూపాయలు ఖర్చయినట్లు చూపించారు. వాస్తవానికి ఆ ఖర్చు 50 కోట్లకు పైమాటే! వీటిన్నంటిపై ఐఏఎఫ్ నుంచి పీఎంవో కార్యాలయం నుంచి మీడియా వివరణ కోరింది. వాటి నుంచి సమాధానం ఇంకా రావాల్సి ఉంది. అవినీతిని అణువంతైన క్షమించనని చెప్పుకునే మోదీ అవినీతి నిర్మూలణను తన దగ్గరి నుంచే మొదలు పెట్టాలి. తప్పుడు లెక్కలు వేసిన ఐఏఎఫ్ అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు బీజేపీ నుంచి రావాల్సిన సొమ్మును రాబట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment