మాజీ స్టార్ క్రికెటర్లు, కాంగ్రెస్ నేతలు శుక్రవారం నగర రాజకీయాలను వేడెక్కించారు. పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఖైరతాబాద్ ప్రజాఫ్రంట్ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌కుమార్‌కు మద్దతుగా ప్రచార ర్యాలీ తీయగా, మరో క్రికెటర్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ అభ్యర్థి పి.విష్ణువర్ధన్‌రెడ్డి తరఫున ఎర్రగడ్డ, రహమత్‌నగర్‌లలో ప్రచారం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎవరికి వారే మాటల తూటాలు పేల్చారు.
ఖైరతాబాద్: హిమాలయాలను ఎలా కదిలించలేరో.. భూమిని ఎలా ఎత్తలేరో.. సముద్రాన్ని ఎలా ఎండగట్టలేరో.. సూర్యుడి తాపాన్ని ఎలా ఆపలేరో అలాగే ఖైరతాబాద్‌లో దాసోజు శ్రవణ్ విజయాన్ని ఆపలేరని మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ ప్రజాఫ్రంట్ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారలో పాల్గొన్న ఆయన సోమాజిగూడ నుంచి ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తా వరకు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజల సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. మిలుగు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.
ప్రస్తుతం రాజకీయ వాతావరణంలో మార్పు అవసరమని, ఇదే అవకాశంగా సిక్స్ కొట్టి చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అభ్యర్థి శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ.. అవినీతికి, నిజానికి మధ్య యుద్ధం జరుగుతోందని, వాగ్దానాలు అమలు చేయమంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పే పార్టీలను నమ్మొద్దన్నారు. తనను గెలిపిస్తే ఖైరతాబాద్‌లో ప్రతి గల్లీకి ఓ ఎమ్మెల్యేను తయారు చేసి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతానన్నారు. ఖైరతాబాద్‌లో కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి హాస్పిటల్ బిల్డింగ్ నిర్మిస్తే సిబ్బందిని, కనీస వసతులు కల్పించలేని నాయకులకు మరోసారి అవకాశం ఇవ్వవద్దన్నారు. చింతల రామచంద్రారెడ్డి టోకెన్లతో మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఓట్లు దండుకొని బానిసలుగా మార్చే వారికి ఓటుతోనే గుణపాఠం చెప్పాలన్నారు. ఈ రోడ్‌షోలో కూటమి నాయకులు బి.ఎన్.రెడ్డి, రోహిన్‌రెడ్డి, మహేష్‌యాదవ్, ఎస్.కె.షరీఫ్, మధుకర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు శ్రవణ్‌కు మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment