
చండీఘడ్ : సుమారు 8 వేల అక్రమ కాలనీల నిర్మాణాలను క్రమబద్దీకరిస్తూ పంజాబ్ ప్రభుత్వం తీసుకువచ్చిన విధానంపై పంజాబ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జరగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తాను. కానీ నాకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ప్రజలు ఓట్లు వేసి నన్ను గెలిపించింది ప్రజా సమస్యలపై నోరు మెదపకుండా ఉండటానికి కాదని’ సిద్ధు వ్యాఖ్యానించారు. ప్రతీ ప్రజా ప్రతినిధి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, వారి సమస్యలపై పోరాడాలన్నారు.
బాస్ నిర్ణయానికే ప్రాధాన్యం ఉంటుంది..
కేబినెట్ సమావేశంలో భాగంగా తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవపోవడాన్ని ప్రస్తావిస్తూ.. అక్రమ కాలనీల క్రమబద్ధీకరణను పూర్తిగా వ్యతిరేకించానని, అయితే ప్రభుత్వానికి బాస్‌గా ఉన్న సీఎం తీసుకునే నిర్ణయాలే అంతిమంగా చెల్లుబాట అయినప్పటికీ వాటి కోసం తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. సొంత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అన్న ప్రశ్నకు బదులుగా.. విమర్శలు వస్తున్నాయంటే నేను ఎంతో కొంత నిజాయితీగా పనిచేస్తున్నానే అర్థం కదా అంటూ సిద్ధు చమత్కరించారు.
కాగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు చోటుచేసుకుంటున్నాయని వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో సిద్ధు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ అండదండలు పుష్కలంగా ఉన్న సిద్ధు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశించారు. కానీ ఆయనకు పర్యాటక, సాంస్కృతిక, స్థానిక సంస్థలు వంటి అంతగా ప్రాధాన్యం లేని శాఖలు కేటాయించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment