ఏడో దశలో ఎన్డీఏకు సగం సీట్లు దక్కేనా? | NDA getting half the seats in the seventh phase | Sakshi
Sakshi News home page

ఏడో దశలో ఎన్డీఏకు సగం సీట్లు దక్కేనా?

Published Tue, May 14 2019 5:40 AM | Last Updated on Tue, May 14 2019 5:40 AM

NDA getting half the seats in the seventh phase - Sakshi

పదిహేడో లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్‌ జరిగే 59 సీట్లలో బీజేపీ కిందటిసారి 32 సీట్లు గెలుచుకుంది. వాటిలో రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో (యూపీలోని గోరఖ్‌పూర్, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌) బీజేపీ ఓడిపోయింది. మొత్తంమీద ఆఖరి దశ ఎన్నికల్లో బీజేపీకి ఉన్న సీట్లు నిలబెట్టుకోవడానికి, ప్రతిపక్షాలు తమ బలాన్ని పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలైన అకాలీదళ్‌(4), ఆరెలెస్పీ(2), జేడీయూ(1), అప్నాదళ్‌(1) ఈ 59లో 8 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో 2017లో జేడీయూ చేరగా, ఆరెలెస్పీ బయటికొచ్చి యూపీఏ మిత్రపక్షంగా మారింది. ఉప ఎన్నికలో గెలిచిన గురుదాస్‌పూర్‌తో కలిపి కాంగ్రెస్‌కు ఐదు స్థానాలున్నాయి. ఈ దశలో పోలింగ్‌ జరిగే పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 9 సీట్లనూ కిందటిసారి తృణమూల్‌ కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఈ సీట్లలో కనీసం మూడు నాలుగు కైవసం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు పన్నుతోంది.  

మధ్యప్రదేశ్‌పైనే కాంగ్రెస్‌ ఆశ!
మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌ జరిగే 8 లోక్‌సభ సీట్లలో బీజేపీకి ఏడు ఉండగా, కాంగ్రెస్‌ సీటు ఒక్కటే. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో చివరి దశ సీట్లలో నాలుగైదు గెలుచుకోవచ్చని ఈ పార్టీ ఆశ పడుతోంది. ఝార్ఖండ్‌లోని మూడు స్థానాల్లో రెండు ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) చేతిలో ఉన్నాయి. మూడో స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. జేఎంఎం అగ్రనేత శిబూ సోరెన్‌ దూమ్కా నుంచి పోటీ చేస్తున్నారు. పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాల్లో అకాలీదళ్, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) నాలుగేసి సీట్లు కైవసం చేసుకున్నాయి.

బీజేపీకి ఒక సీటు దక్కింది. ఆప్‌ ఎంపీల్లో ముగ్గురికి పార్టీ కేంద్ర నాయకత్వంతో మంచి సంబంధాలు లేవు. ఈ రాష్ట్రంలో కూడా రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ ఇప్పుడు అధికారంలో ఉంది. మారిన పరిస్థితుల్లో పంజాబ్‌లో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్‌ పట్టుదలతో పనిచేస్తోంది. 2017 ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని అకాలీదళ్‌ తన ఉనికి కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతోంది. అందుకే పార్టీ నేత, ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ కొడుకు, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ ఫిరోజ్‌పూర్‌ నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్నారు. ఉన్న బలం నిలబెట్టుకోవడానికి ఆయన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.  

యూపీలో ప్రతిపక్షాల బలం పెరిగే అవకాశం
ప్రతిపక్షాలకు ఈ దశలో ఎక్కువ సీట్లు గెలిచే అవకాశమున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. పోలింగ్‌ జరిగే 13 సీట్లలో కిందటిసారి బీజేపీ 12 గెలుచుకోగా, మిత్రపక్షమైన అప్నాదళ్‌ ఒక స్థానం కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ, ఆరెల్డీతో కూడిన మహా కూటమి దాదాపు సగం స్థానాలు గెలవగలననే నమ్మకంతో ఉంది. 2014 మాదిరిగా బీజేపీ దాదాపు అన్ని సీట్లు గెలిచే పరిస్థితి లేదని మహా కూటమి అంచనా వేస్తోంది. యూపీ బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తన సొంత స్థానమైన గోరఖ్‌పూర్‌పై తన పట్టు ఎలాగైనా నిలబెట్టుకోవాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

2018 ఉప ఎన్నికలో గెలిచిన ప్రవీణ్‌ నిషాద్‌ ఎస్పీకి రాజీనామా చేసి బీజేపీకి దగ్గరయ్యారు. ఎస్పీ కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది. నాలుగు సీట్లున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో కిందటి ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని కాంగ్రెస్‌ సగం స్థానాలు కైవసం చేసుకోవాలనుకుంటోంది. కేంద్ర మాజీ మంత్రి, కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌రామ్‌ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినా మారిన పరిస్థితుల్లో బీజేపీ నాలుగు సీట్లు కైవసం చేసుకోవడం కష్టమే. మొత్తం మీద చివరి దశ పోలింగ్‌ జరిగే 59లో సగానికి పైగా బీజేపీ గెలుచుకుంటేనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీఏకు మార్గం సుగమం అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement