కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం వల్ల స్థానిక సంస్థల అధికారాలు గల్లంతయ్యాయని, త్వరంలో కొత్త పంచాయతీ రాజ్ చట్టం తేబోతున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఉమ్మడి జెడ్పీ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. కొత్త చట్టం ద్వారా మళ్లీ స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయిస్తామని వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిథులకు అధికారాలు ఇస్తే అభివృద్ధి జరుగుతుందనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. అసెంబ్లీలో చట్టసవరణ చేశాక స్థానిక సంస్థలకు చెక్‌పవర్, అధికారాలు ఇస్తామని పేర్కొన్నారు.
చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేలా కొత్త చట్టం తెస్తున్నామని, పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ వ్యవస్థలో లోపాలున్నాయని, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి రహిత పాలన అందివ్వాలన్నది సీఎం ఆలోచన, నిధుల విషయంలో కరీంనగర్‌కు పెద్దపీట వేస్తామని తెలిపారు.
రాజకీయ నాయకులకు రిటైర్‌మెంట్ ఉండదు: ఈటల
రాజకీయ నాయకులకు రిటైర్‌మెంట్ ఉండదని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. పదవి ముఖ్యం కాదు.. ఆ పదవిలో ఎంత మంచి పని చేశామన్నది ముఖ్యమన్నారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు ఎప్పుడూ జరగలేదని, మంత్రిగా సొంత జిల్లాకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని, వైద్యరంగంపై దృష్టి పెడతానని చెప్పారు.స్థానిక సంస్థల పెండింగ్ బిల్లులను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ వల్ల నిలిచిన పనులను వేగవంతం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment