
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ఈనెల 9న ముగియనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు వారాలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రాలేదన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమిగా పోటీ చేసిన శివసేన, బీజేపీ మధ్య ముఖ్యమంత్రి పదవి విషయంలో విభేదాలు తలెత్తడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారంటూ వార్తలు వెలువడటంతో రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన నితిన్ గడ్కరీ.. తాను ఢిల్లీలోనే(కేంద్ర మంత్రి) విధులు నిర్వర్తిస్తానని.. రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. అదే విధంగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఆరెస్సెస్ జోక్యం చేసుకుంటుందన్న వార్తలను కొట్టిపడేశారు. శివసేన తమకు మద్దతు ఇస్తుందనే నమ్మకం ఉందన్నారు.
ఇక రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ.. ‘కూటమికి ప్రజలు జైకొట్టారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. ఈరోజు మేము గవర్నర్‌తో సమావేశమవుతున్నాం. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి చర్చించబోతున్నాం’ అని పేర్కొన్నారు. మరోవైపు ఎన్సీపీ ప్రతిపక్షంలోనే కూర్చుంటామని తేల్చిచెప్పినప్పటికీ.. శివసేన మాత్రం ముఖ్యమంత్రి పదవిపై పట్టువీడటం లేదు. అంతేగాకుండా బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.