
సాక్షి, అమరావతి : చంద్రబాబు–పవన్ కళ్యాణ్‌ల రహస్య స్నేహం మరోసారి బయటపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కక్ష సాధించేందుకే టీఆర్‌ఎస్ నేతలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతిస్తున్నారని గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్‌ను విమర్శించొద్దని చంద్రబాబు టీడీపీ నేతలకు హుకుం జారీచేశారు. దీంతో వారి మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం బహిర్గతమైంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ బాధ్యులతో శనివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.. పవన్ జోలికి వెళ్లొద్దని స్పష్టమైన సూచనలు చేశారు. ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్‌లపైనే ఆరోపణలు చేయాలని, వారు ముగ్గురు ఒకటేనన్న ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఈ సమయంలో పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుని పవన్ కూడా ఉన్నాడుగా అని గుర్తు చేయగా.. తాను చెప్పింది చేయాలని బుచ్చయ్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పవన్ ఇంతకాలం చంద్రబాబును, టీడీపీని పైకి తిడుతూ లోలోపల స్నేహం చేస్తున్నట్లు స్పష్టమైంది.
25 ఎంపీ, 150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలవాలి
కాగా, వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ, 150 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యమని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చెప్పారు. కేసీఆర్, జగన్ తప్ప అందరూ కోల్‌కత వచ్చారని.. వారిద్దరూ మోడీ వెంట ఉన్నారని స్పష్టమైందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది అసలు లేదని, అదొక శూన్యమని, పెద్ద సున్నా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మోదీకి మద్దతు కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేశారని, అదసలు బీజేపీకి ప్రతిపక్షమే కాదన్నారు. టీఆర్‌ఎస్ నాయకులను ఆంధ్ర ద్వేషులుగా, వరంగల్‌లో తనపై రాళ్లేసిన వారితో జగన్ లాలూచీ పడినట్లు ప్రచారం చేయాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చామని బీజేపీ అనడం హాస్యాస్పదమన్నారు. ప్రతీ కార్యకర్త ఒక మొబైల్ మీడియా (సంచార మాధ్యమం)గా మారి ఈ విషయాలను ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని సీఎం ఆదేశించారు. కాగా, డబ్బులు ఖర్చుపెట్టే అభ్యర్థులను వైఎస్సార్ కాంగ్రెస్ వెతుకుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా చేస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment