సాక్షి, రాజమహేంద్రవరం/నిడదవోలు: టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై విభేదాల అగ్గి రగిలింది. పొత్తు ధర్మం, విలువలు పాటించకుండా చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే అన్నట్లు సీట్లు కేటాయించడం, జాబితా రూపొందించడంపై ఇరు పార్టీల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
నివురుగప్పిన నిప్పులా నిడదవోలు
నిడదవోలు నుంచి తాను పోటీ చేస్తున్నట్టు జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ స్వయంగా ప్రకటించారు. దీనికి అధినేత పవన్ కల్యాణ్ సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని చెబుతూ, ఇప్పటికే నిడదవోలులోని కొంతమంది జనసేన నాయకులతో దుర్గేష్ మాట్లాడారని, వారికి ఆయన వర్గీయులు సైతం ఫోన్ చేసి, నియోజకవర్గ సమాచారం సేకరిస్తున్నారని తెలిసింది. ఈ పరిణామంపై ఇప్పటికే ఆ టికె ట్ ఆశిస్తున్న అక్కడి టీడీపీ నేతలు చంద్రబాబుపై కస్సుమంటున్నారు. తమను కాదని స్థానికేతరులకు నిడదవోలు టికెట్ ఇస్తే టీడీపీకి మూకుమ్మడి రాజీనామాకు సైతం సిద్ధమని అల్టిమేటం జారీ చేస్తున్నా రు. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలోని టీడీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఇంటి వద్దకు ఆదివారం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. ఆయనకు అనుకూలంగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిడదవోలులో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి.
రాజకీయాలకు గుడ్‌బై చెప్పే యోచనలో బూరుగుపల్లి
టీడీపీ నేత బూరుగుపల్లి శేషారావు నిడదవోలు టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల టీడీపీ నిర్వహించిన సర్వేలో సైతం ఆయనకు అనుకూలంగా వచ్చిందని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకొంటున్నాయి. చంద్రబాబు సైతం భరోసా ఇవ్వడంతో ఆయన లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో తలమునకలవుతున్నారు. ఈ తరుణంలో కందుల దుర్గేష్‌కు ఈ సీటు కేటాయిస్తారన్న సమాచారం అందడంతో శేషారావు వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. టికెట్ దక్కకుంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో సైతం ఉన్నట్లు చెబుతున్నారు.
కుందులది మరో దారి
నిడదవోలు స్థానం జనసేనకు కేటాయించారని టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉంటే.. టీడీపీ టికెట్ ఆశిస్తున్న మరో నేత కుందుల సత్యనారాయణ విచిత్ర ప్రకటన చేశారు. టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తనకు అవకాశం కల్పిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. శేషారావు, సత్యనారాయణ మధ్య ఇప్పటికే వర్గ విభేదాలు నడుస్తున్నాయి. టీడీపీ కార్యక్రమాలు సైతం వారు వేర్వేరుగా చేస్తున్నారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో సైతం ఎవరికి వారే అన్న చందంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చేతిచమురు కూడా బాగానే వదిలించుకున్నారు. తాను కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఇచ్చానని, తనకు కాకుండా టికెట్ ఇతరులకు ఎలా ఇస్తారని కుందుల సత్యనారాయణ తన అనుచరుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత దుర్గేష్ పోటీ చేస్తే, ఆయనకు సహకరించేందుకు టీడీపీకి చెందిన కమ్మ సామాజికవర్గ నాయకులు ఆసక్తి చూపడం లేదు.
భగ్గుమన్న జనసేన నేతలు
దుర్గేష్‌కు రాజమహేంద్రవరం రూరల్ కేటాయించకపోవడంతో జనసేన నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఈ నెల 20న రాజమహేంద్రవరం వచ్చిన జన సేన అధినేత పవన్ కల్యాణ్ అంతర్గత సమావేశంలో ఈ సీటుపై దుర్గేష్‌కు భరోసా ఇచ్చారని, ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ మార్పు చేయడం ఏమిటని దుర్గేష్ అనుచరులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. జనసేన పార్టీ గుర్తు ఉన్న స్టిక్కర్లు చించివేశారు. జెండా పీకేసి నిరసన తెలిపారు. దుర్గేష్‌కు రాజమహేంద్రవరం రూరల్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
చక్రం తిప్పిన గోరంట్ల
రాజమహేంద్రవరం రూరల్ సీటును తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో టీడీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చక్రం తిప్పారు. ఈ సీటు చేజారిపోయిందనుకున్న సమయంలో చంద్రబాబుతో పెద్ద ఎత్తున వాదనకు దిగి మరీ సాధించుకున్నారని అంటున్నారు. ఈ విషయమై పవన్ కల్యాణ్ సైతం రంగంలోకి దిగారు. దుర్గేష్‌ను శనివారం రాత్రి మంగళగిరికి పిలిపించారు. రూరల్ ఆశలు వదిలేసి, నిడదవోలు నుంచి పోటీ చేయాలని ఆయనకు పవన్ సూచించారు. చేసేది లేక దుర్గేష్ నిడదవోలు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment