సాక్షి, న్యూఢిల్లీ : దేశానికి గాంధీల వారసత్వ ప్రభుత్వం కావాలా ? లేదా అభివద్ధి కావాలా ? అని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్ర నాయకులు ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలను ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి భారత దేశంలో బీజేపీ సహా ఏ పార్టీ వారసత్వ రాజకీయాలకు అతీతం కాదు. దేశంలోని 36 పార్టీల్లో ఈ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. జాతీయ పార్టీలే కాకుండా, ప్రాంతీయ పార్టీల్లో ఈ వారసత్వ రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. లోక్‌సభకు తొలి ఎన్నికలు జరిగిన 1952 నుంచి 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన 4,807 మంది పార్లమెంట్ సభ్యుల కుటుంబాల నేపథ్యాన్ని అమెరికాలోని ‘హార్వర్డ్ యూనివర్శిటీ’, జర్మనీలోని ‘మన్హేయిమ్ యూనివర్శిటీ’ పరిశోధకులు అధ్యయం చేసి ఆసక్తికరమైన విశయాలను వెల్లడించారు.
ముఖ్యంగా 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల నుంచి వారసత్వ రాజకీయాలు పెరిగాయి. నాటి నుంచి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల వరకు ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీల్లో 36 మంది వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారే. ఈ విషయంలో బీజే పీ పెద్దగా వెనకబడేమీ లేదు. బీజేపీ ఎంపీల్లో 31 మంది వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారే. 1999లో జరిగిన 13వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 8 శాతం మంది రాజకీయ వారసులు ఎన్నికకాగా, బీజేపీ నుంచి ఆరు శాతం మంది ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 20 శాతం, బీజేపీ నుంచి పది శాతం మంది వారసులు ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 23 శాతం మంది, బీజేపీ నుంచి పది శాతం మంది వారసులు ఎన్నికయ్యారు.
ఇక 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీల పరిస్థితి తల కిందులయింది. బీజేపీ నుంచి 20 శాతం మంది వారసులు గెలవగా, కాంగ్రెస్ నుంచి ఏడుశాతం మందే గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లను గెలుచుకోవడమే అందుకు కారణం. ఎంపీల వారసత్వాన్ని లోక్‌సభకు మాత్రమే పరిమితమై పరిశోధకులు విశ్లేషించారు. అంటే రాజ్యసభ లేదా రాష్ట్ర అసెంబ్లీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రక్త సంబంధీకులను పరిగణలోకి తీసుకోలేదు. కొడుకు, కూతురు, భార్య, వారి పిల్లలను మాత్రమే వారసత్వంగా పరిగణించారు. కోడలు, అల్లుళ్లను పరిగణలోకి తీసుకోలేదు.
ఉత్తరప్రదేశ్ నెంబర్ వన్
వారసత్వ రాజకీయాలకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రం నుంచి 1952 నుంచి ఇప్పటి వరకు 51 మంది రాజకీయ వారసులు ఎన్నికయ్యారు. బీహార్ నుంచి 27 మంది, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి పది మంది చొప్పున రాజకీయ వారసులు ఎన్నికయ్యారు. నెహ్రూ–గాంధీ కుటుంబం మొదటి నుంచి యూపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో బీజేపీ నుంచే ఎక్కువ మంది రాజకీయ వారసులు గెలుపొందారు. మొత్తం 51 మందిలో బీజేపీకి చెందిన వారే 17 మంది ఉన్నారు. కాంగ్రెస్ నుంచి విడిపోయిన కాంగ్రెస్ ఐకి చెందిన వారు ఆరుగురు కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారసులు 9 మంది ఉన్నారు. బీఎస్పీ నుంచి నలుగురు ఉన్నారు. బీహార్‌లో కాంగ్రెస్ నుంచి 12 మంది, బీజేపీ నుంచి నలుగురు, జనతా పార్టీ నుంచి ముగ్గురు వారసులు ఉన్నారు. ఇక బెంగాల్‌లో తణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు. పంజాబ్‌లో శిరోమణి అకాలీ దళ్ నుంచి నలుగురు వారసులు లోక్‌సభకు ఎంపికయ్యారు.
కారణాలు ఏమిటీ?
1957లో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 42 మంది స్వతంత్య్ర అభ్యర్థులు విజయం సాధించగా, 2014లో జరిగిన ఎన్నికల్లో వారి సంఖ్య మూడుకు (3)కు పడిపోయింది. నేడు ఎన్నికల్లో పోటీ చేయడం అనేది కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన వ్యవహారం అయింది. రాజకీయ వారసులు తప్పించి ఇతరులు అంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఇంజనీరు, డాక్టర్ పిల్లలు సహజంగా రాజMీ య నాయకులు కావాలని కోరుకోరు. రాజకీయ నాయకుల పిల్లలు మాత్రం రాజకీయాల్లోకి రావాలని నూటికి 110 శాతం కోరుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. వారసత్వ రాజకీయాల్లోకి వచ్చిన వారికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వారు ముందే స్థానిక నియోజక వర్గం ప్రజలకు తెలిసిపోతారు. దేశంలో ఈ పార్టీ కూడా రాజకీయ వారసత్వానికి అతీతం కాదు. కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అపప్రద ఎందుకొచ్చిందంటే రాజకీయ వారసులు కేంద్ర పార్టీ నాయకత్వంలో ఉండడం.
వారసత్వం వల్ల నష్టమే
వారసత్వ రాజకీయాల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఒకే నియోజకవర్గానికి వారు పరిమితం అవడం వల్ల కొత్త వారికి, కొత్త ఆలోచనలకు అవకాశం ఇవ్వడం లేదు. వారసులే గుత్తాధిపత్యంతో వ్యవహరిస్తున్నారు. వారసత్వ రాజకీయాలకు బ్రేక్ వేయడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఓ ప్రయోగం చేశారు. వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారికి వారి సొంత నియోజకవర్గం కాకుండా ఇతర నియోజక వర్గాలు కేటాయించారు. దాని వల్ల ఆయన ఆశయం నెరవేరుతుందని భావించలేం. రాజకీయ పార్టీల్లోనే ప్రజాస్వామ్య విలువలకు పట్టంకట్టినప్పుడు మాత్రమే అది సాధ్యం. అయితే అది సుదూర స్వప్నమే.
చదవండి: విదేశాల్లోనూ వారసత్వ రాజకీయం
రాజకీయ వారసత్వంతో ఎంత ముప్పు?
Comments
Please login to add a commentAdd a comment