
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభకు పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తో పాటు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ నామినేషన్ వేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడిం చాయి.
అయితే, రాజ్యసభ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలుకు సోమవారం వరకే గడువుండగా, ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి ఆమోదముద్ర లభించింది. బలరాంనాయక్‌తో పాటు గూడూరు నారాయణరెడ్డి కూడా తనకు అవకాశమివ్వాలని పట్టుబట్టిన నేపథ్యంలో ఆదివారం రాత్రి హస్తిన నుంచి ఆలస్యంగా కబురందింది. దీంతో బలరాం నాయక్‌తో నామినేషన్ దాఖలుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.
అదే వ్యూహం: తమకు గెలిచే బలం లేనప్పటికీ పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించింది. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన గెలిచిన ఎమ్మెల్యేలలో విఠల్‌రెడ్డి, కాలె యాదయ్య, కోరం కనకయ్య, రెడ్యానాయక్, పువ్వాడ అజయ్‌కుమార్, ఎన్.భాస్కరరావు, చిట్టెం రామ్మోహనరెడ్డిలు టీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో వారిని అనర్హులుగా చేయాలని ఒత్తిడి పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.
ఈనెల 9న జరిగిన సీఎల్పీ భేటీలో ఇదే అంశంపై తీవ్రంగా చర్చించిన కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాన్నే అమలు చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ విప్ మేరకు కాంగ్రెస్ గుర్తుపై పోటీచేసి గెలిచిన అందరూ ఎన్నికల ఏజెంటుకు చూపించి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. అలా వేయని పక్షంలో విప్ ఉల్లంఘన ఆధారంగా ఆ ఏడుగురు సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని మరోమారు అసెంబ్లీ స్పీకర్‌ను కోరాలని కాంగ్రెస్ పక్షం భావిస్తోంది.