తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.లక్ష కోట్లు.. మన రాష్ట్ర బడ్జెట్‌కు అదనంగా అక్షరాలా మరో లక్ష కోట్ల రూపాయలన్నమాట. ఏంటీ లక్ష కోట్ల కథ అనుకుంటున్నారా?. రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు పార్టీ టీడీపీ పక్షాన ఈ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే కావాల్సిన నిధుల లెక్క ఇది. ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులకు పెట్టాల్సిన ఖర్చు, ప్రభుత్వ నిర్వహణకు అవసరమయ్యే ఖర్చులు పోను రూ.లక్ష కోట్లను ఎక్కడి నుంచి తెస్తాం.. అనే అంచనా కూడా లేకుండా టీడీపీ మేనిఫెస్టోలో ఎడాపెడా హామీలిచ్చేశారు పచ్చ పార్టీ నేతలు. ఇన్ని హామీలిచ్చి, ఇంత డబ్బు ఖర్చు చేస్తామని చెప్పిన ఈ పార్టీ పోటీచేస్తున్న స్థానాలెన్నో తెలుసా... 13 మాత్రమే. 13 స్థానాల్లో పోటీచేసి ఏకంగా లక్ష కోట్లకు టెండర్ పెట్టిన తెలంగాణ టీడీపీ.. ప్రజలకు హామీలు ఇచ్చి మాట తప్పడం వెన్నతో పెట్టిన విద్యగా పేరున్న తమ అధినేత చంద్రబాబు బాటలోనే నడుస్తుండటం చర్చనీయాంశమవుతోంది.
ఎడాపెడా హామీలు...
టీడీపీ మేనిఫెస్టోను పరిశీలిస్తే అమలు సాధ్యమా? కాదా? అనే అంశాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా హామీలిచ్చినట్లు అర్థమవుతోంది. ఆ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు రుణమాఫీకే రూ.50 వేల కోట్లు అవసరం. రాష్ట్రంలోని 54.5 లక్షల మంది రైతులకు సంబంధించి 2018–19 సంవత్సరానికి గాను ఖరీఫ్‌లో రూ.30 వేల కోట్లు, రబీలో రూ.19 వేల కోట్లు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. ఈ నిధులు ఎక్కడి నుంచి తెస్తారనేది అంతుపట్టని పరిస్థితి. మిగిలిన ప్రధాన హామీల్లో ఆడపిల్ల పుడితే రూ.50 వేలు, 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా సైకిళ్లు, విద్యారంగానికి అదనంగా రూ.5 వేల కోట్ల కేటాయింపు, గర్భిణులకు పౌష్టికాహారం, వైద్య సాయం కోసం రూ.15 వేలు, వైద్య రంగానికి అదనంగా మరో రూ.10 వేల కోట్లు కలిపితే అది భారీ మొత్తం కానుంది.
వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు, కుటుంబంలోని ప్రతి మనిషికి నెలకు 7 కిలోల చొప్పున కిలో రూపాయి బియ్యం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, వివాహ సాయం కింద రూ.1.5 లక్షలు, ధరల స్థిరీకరణ కోసం రూ.10 వేల కోట్లు కలిపితే రూ.లక్ష కోట్లు దాటనుంది. ఇదంతా రాష్ట్ర బడ్జెట్‌లో సాధారణంగా అయ్యే ఖర్చు కన్నా అదనంగా పెట్టాల్సిందేనని, మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చేటప్పుడు ఆలోచించాలని, లేదంటే ఈ లక్ష కోట్లకు ఆదాయపు లెక్కలను కూడా చూపించాల్సి ఉందని ఓ ఆర్థిక నిపుణుడు వ్యాఖ్యానించారు.
ఆంధ్రలో ‘టోపీ’...
ఎన్నికల సమయంలో అమలు సాధ్యం కాని హామీలిచ్చి ఓటర్లను ఆకట్టుకుని ఆ తర్వాత టోపీ పెట్టడం బాబుకు అలవాటేనని చరిత్ర చెబుతోంది. 2014 ఎన్నికల సందర్భంగా ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన తుంగలో తొక్కారు. ఆ ఎన్నికల్లో గెలుపు కోసం ఏపీ ప్రజలకు సుమారు 600 హామీలిచ్చారు చంద్రబాబు. అందులో మెజార్టీ హామీలు నెరవేరనే లేదు. రైతు రుణ మాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ (ఇన్సెంటివ్ ఇచ్చాడు), అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మిస్తానని అమలు చేయలేకపోయారు.
నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఎన్నికలకు ఐదారు నెలల ముందు అమలు చేశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో ఇంటింటికీ మంచినీరు, బీసీ కులాలను ఒక గ్రూపు నుంచి మరో గ్రూపునకు మారుస్తానని, కొన్ని బీసీ కులాలను ఎస్సీల్లో, కొందరిని ఎస్టీల్లో చేరుస్తానని, కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తానని, ఇంటింటికీ ఉద్యోగం, బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న మహిళల బంగారం ఇంటికి తెప్పిస్తానని, పోలవరంతో సహా అనేక ప్రాజెక్టులు పూర్తిచేస్తానని కాలపరిమితితో కూడిన హామీ ఇచ్చి అక్కడి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు... తెలంగాణలో కూడా ఓటర్లను మభ్యపెట్టేందుకు పలు హామీలను మేనిఫెస్టోలో పెట్టడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment