సాక్షి, హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ సభ్యులను ఆ పార్టీ అధినేత చంద్రబాబే స్వయంగా బీజేపీలోకి పంపించారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులను వ్యతి రేకించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతోనే టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనం చేస్తూ బీజేపీ బులెటిన్ విడుదల చేయించిందన్నారు.
రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అని 25 ఏళ్లుగా చెబుతున్న బీజేపీకి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ శాసనసభ్యుల సంఖ్య ఐదు నుంచి ఒకటికి పడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. సచివాలయం, అసెంబ్లీకి నూతన భవన నిర్మాణాల గురించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారిందన్నారు. సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి ఎవరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలు రెండు రాష్ట్రాల నడుమ వివాదాల పరిష్కారానికి పూనుకోవడం చారిత్రాత్మకమన్నారు. సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాన్ని విమర్శిస్తున్న వారే.. ఆ తర్వాత కొత్త భవనాల ముందు ఫొటోలు దిగుతారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. సచివాలయం నిర్మాణంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన విమర్శలను ఖండించారు. ముంబై లో శివాజీ, గుజరాత్‌తో సర్దార్ పటేల్ విగ్రహాల కోసం రూ.వేల కోట్లు వెచ్చించిన వారు.. తెలంగాణ కు కొత్త అసెంబ్లీ, సచివాలయం భవనాల నిర్మాణం పై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment