పాపన్నపేట(మెదక్): కుట్రదారులారా.. ఖబర్దార్.. తెలంగాణను ముంచడానికే మహాకూటమి ఏర్పడిందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం పాపన్నపేట మండలం ఏడుపాయల్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి నిర్ణయాలు ఆంధ్రాలోగాని ఢిల్లీలోగాని నిర్ణయించేందుకు తెలంగాణ బిడ్డలు ఒప్పుకోరని, కూటమీ కుట్రలను తిప్పి కొడతారని హెచ్చరించారు. వందసీట్లు పక్కాగా సాధించి తెలంగాణ సత్తా చాటు తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీల సిద్ధాంతాలు మరిచి ఒక్కటి కావడం మోసపూరిత కుట్రకు నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే అనైతిక పొత్తులు పెట్టుకున్నారని అన్నారు.
ఆరోజు టీఆర్‌ఎస్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ వారితో జై తెలంగాణ అనిపించి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు ఆపాలని 20కిపైగా కేసులు వేయడంతోపాటు హైకోర్టు విభజనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ 20 ఏళ్ల పాలన, కాంగ్రెస్60 ఏళ్ల పాలనలో తెలంగాణ నిండా మునిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ ఫలాలను గడపడగడపకు అందిస్తూ.. తెలంగాణ ప్రజలు జీవన ప్రమాణాలను మెరుగుపర్చారని తెలిపారు.
రైతుబంధు, రైతుబీమా, పింఛన్ల పెంపు, 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, షాదిముబారక్, కేసీఆర్ కిట్లు, కంటి పరీక్షలతో తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. వీటిని చూసి తట్టుకోలేక ఉత్తమ్‌కుమార్ ఉత్త మాటలతో ప్రజల్లోకి వస్తుంటే ఎవరు నమ్ముతారన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ సాకారం అవుతుందని, ప్రజల బతుకులు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఆమె వెంట ఎంపీపీ పవిత్రదుర్గయ్య, ఏడుపాయల పాలకవర్గ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు.
కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు నమ్మొద్దు
మెదక్ మున్సిపాలిటీ: కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్‌లోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో హవేళిఘణాపూర్ మండలం బ్యాతోల్ గ్రామానికి చెందిన సుమారు 80మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పద్మాదేవేందర్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు 60 ఏళ్ల పాలించాయని, వారి పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించి వారి అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. అభివృద్ధికి కాంగ్రెస్ నాయకులు అడుగడుగున అడ్డు పడుతున్నారన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, మెదక్, హవేళిఘణాపూర్ మండలాల టీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, అంజాగౌడ్, కిష్టయ్య, మాణిక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్న బ్యాతోల్ గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment