సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అహ్మద్ పటేల్‌ను గద్దె నెక్కించేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నిందని, దీని కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మణిశంకర్ అయ్యర్ నివాసంలో ఓ రహస్య సమావేశం జరిగిందని, దీనికి మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, మాజీ భారత ఉపరాష్ట్రపతి హమీద్ హన్సారీ, పాకిస్థాన్ హై కమిషనర్‌లు హాజరయ్యారనీ పలాన్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణల సారాంశం. ఇది అత్యంత సంచలనాత్మక అంశం. దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికే ముప్పుతెచ్చే కీలకాంశం.
ఇంతటి తీవ్రమైన విదేశీ కుట్రకు సంబంధించిన విషయాన్ని తనకు వేగుల ద్వారా, అంటే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెల్సిందని కాకుండా, నేడు మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్న అంశంగా సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొనడం అన్నింటికంటే ఆశ్చర్యకరమైన అంశం. నిజంగా మణిశంకర్ అయ్యర్ నివాసంలో అలాంటి రహస్య సమావేశం జరిగిందా ? జరిగితే ఎందుకు కోసం జరిగిందీ? ఎవరెవరూ పాల్గొన్నారు ? వారిలో పాకిస్తాన్ దౌత్యవేత్తలు ఉన్నారా? అన్న అంశాలను తక్షణమే తేల్చుకునేందుకు నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో అన్ని ఇంటెలిజెన్స్ వర్గాలను అప్రమత్తం చేయాల్సి ఉంది. నిజనిజాలను నిర్ధారించుకున్నాక, వారిపై కేసులు కూడా నమోదు చేశాక మీడియా ముందుకు ఆ విషయాన్ని తీసుకరావాలి. అప్పటి వరకు మౌనం వహించడం ఆయన బాధ్యత. కానీ, మీడియాలో ఈ అంశంపై చర్చ జరుగుతోందంటూ మాట్లాడటం ఎంత వరకు సబబు? అసలు ప్రధాని ప్రధాన ఉద్దేశం ఏమిటీ?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాన మంత్రిని విమర్శించిన జర్నలిస్టులు, బ్లాగర్లు, సోషల్ మీడియా విమర్శకులపై, రచయితలపై, బాలు లాంటి కార్టూనిస్టులపై కూడా దేశద్రేహం కేసులను నమోదు చేస్తున్న పోలీసు అధికారులు మణిశంకర్ అయ్యర్ నివాసంలో అంత పెద్ద కుట్ర జరిగితే ఎందుకు స్పందించడం లేదు? పాకిస్తాన్ కుట్ర నిజం కాదా? రహస్య సమావేశం నిజం కాదా? (భారత్ అంతర్గత ఎన్నికల్లోకి తమను లాగవద్దంటూ మోదీ ఆరోపణలపై పాకిస్థాన్ ఘాటుగా స్పందించిన విషయం తెల్సిందే) బీజేపీ నాయకుడు అజయ్ అగర్వాల్ మొన్న ‘ఏఎన్‌ఐ’ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘మణిశంకర్ అయ్యర్ నివాసంలో ఆరవ తేదీ సాయంత్రం ఓ రహస్య సమావేశం జరిగింది. ఆ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, పాకిస్థాన్ దౌత్యవేత్త, మరికొందరు కాంగ్రెస్ నాయకులు పాల్గాన్నారు. సమావేశం సందర్భంగా ఎంతమంది పోలీసులు అక్కడ మోహరించారంటే, అప్పుడు ఆ రోడ్డంతా బ్లాక్ అయింది’ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా అంతపెద్ద పోలీసు మోహరింపు సాధ్యం కాదు. అంతమంది పోలీసుల భద్రత మధ్య సమావేశం జరిగిందంటే అది రహస్య సమావేశం ఎలా అవుతుంది?
‘కాంగ్రెస్ అధికారి అహ్మద్ పటేల్ మా మార్గదర్శి. ఆయనే ముఖ్యమంత్రి కాబోతున్నారు’ అంటూ ‘డైరెక్టర్ జనరల్ ఇన్ పాకిస్థాన్ ఆర్మీ’ పేరిట ఫేస్‌బుక్‌లో ఓ పోస్టింగ్ వచ్చింది. ఈ ఫోస్టింగ్‌ను ఆధారం చేసుకొని ‘న్యూస్‌ఎక్స్’ టీవీ ఛానల్, నకిలీ వార్తలను ప్రచురించడంలో అగ్రభాగాన ఉండే ‘పోస్ట్‌కార్డ్’ వెబ్‌సైట్ వార్తలను ప్రసారం చేసింది. ఆ మాటకొస్తే పాకిస్థాన్ అర్మీలో ‘డైరెక్టర్ జనరల్’ అంటూ ఎవరూ ఉండరు. పాక్ సైనిక దళాల ప్రధానాధికారిని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అని, లేదా పాకిస్థాన్ మిలిటరీ చీఫ్ అని వ్యవహరిస్తారు. పాక్ సైన్యంలో 31 మంది లెఫ్ట్‌నెంట్ జనరళ్లు, 155 మంది మేజర్ జనరల్స్ ఉన్నారు.
అంటే, డైరెక్టర్ జనరల్ పేరిట ఫేస్‌బుక్‌లో వచ్చిన పోస్టింగ్ నకిలీదని అర్థం అవుతోంది. ఓ నకిలీ పోస్టింగ్ ఆధారంగా ఓ ఛానల్, ఓ వెబ్‌సైట్ వార్తలను ప్రసారం చేయడం ఎంత మేరకు సబబన్నది వారి నైతికతకు సంబంధించిన అంశం. కానీ ఓ ప్రధాన మంత్రి స్థాయిలోని వ్యక్తి నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఎలా మాట్లాడారన్నది ప్రజలను తొలుస్తున్న ప్రశ్న.
ఇంతకు గుజరాత్‌లో పాక్ కుట్ర ఉన్నట్టా, లేనట్టా...?
Published Mon, Dec 11 2017 4:47 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment