సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై పాకిస్థాన్ స్పందించింది. భారత ఎన్నికల చర్చలోకి తమను లాగొద్దని పేర్కొంది. 'భారత్ తన సొంత ఎన్నికల చర్చలోకి పాకిస్థాన్‌ను లాగడం మానుకోవాలి. కల్పితమైన కుట్ర ఆరోపణలకు బదులు సొంత బలంతో ఎన్నికలను గెలిచే ప్రయత్నం చేయాలి. ఈ కుట్ర కథనాలు ఆధారరహితం, బాధ్యతారాహిత్యం' అని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ మహమ్మద్ ఫైజల్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు పాక్ నేతలతో ఇటీవల సమావేశమయ్యారన్న వార్తలను మోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలని మోదీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ గుజరాత్ సీఎం కావాలంటూ పాకిస్తాన్ మాజీ ఆర్మీ డైరెక్టర్ జనరల్ సర్దార్ అర్షద్ రఫీక్ కోరటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ‘మణిశంకర్ అయ్యర్ నివాసంలో జరిగిన సమావేశంలో.. పాక్ హై కమిషనర్, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, భారత మాజీ రాష్ట్రపతి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ భేటీలో పాల్గొన్నట్లు మీడియా వార్తలొచ్చాయి.
దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం జరిగిందని చానెళ్లు పేర్కొన్నాయి. ఆ తర్వాతి రోజే మణిశంకర్ అయ్యర్ అభ్యంతరకరంగా మాట్లాడారు. ఇది చాలా సీరియస్ అంశం’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘ఓ వైపు పాక్ ఆర్మీ మాజీ డీజీ గుజరాత్ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటారు. మరోవైపు, పాకిస్తాన్ నేతలు మణిశంకర్ అయ్యర్ నివాసంలోనే ఆయనతో సమావేశమవుతారు. ఆ సమావేశంలో గుజరాత్ ప్రజలు, వెనుకబడిన తరగతులు, పేదలు, మోదీని అవమాన పరిచేలా మాట్లాడతారు. ఇలాంటి ఘటనలు కొత్త సందేహాలను లేవనెత్తుతాయని మీరనుకోవటం లేదా?’ అని మోదీ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలపై కాంగ్రెస్ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఘాటుగా స్పందించిన కాంగ్రెస్..
గుజరాత్ ఎన్నికల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటోందన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. రెండేళ్ల కిందట ప్రధాని మోదీ ఎందుకు పాకిస్థాన్‌లో అనూహ్యంగా ఆగి.. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట పెళ్లి వేడుకకు ఎందుకు హాజరయ్యారని నిలదీసింది.
'ప్రధాని మోదీ పాకిస్థాన్‌లో దిగి.. అప్పటి ప్రధాని షరీఫ్ ఇంట పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఎందుకు ఆయన వెళ్లారు. ఆయనను ఆహ్వానించారా' అని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో ఉగ్రవాద దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించేందుకు పాక్ అధికారులను ఎందుకు అనుమతించారని అడిగారు. ఉగ్రదాడి సూత్రధారులను పాక్ శిక్షించకపోయినా.. ఆ దేశ అధికారులను వైమానిక స్థావరంలోకి అనుమతించడం గతంలో రాజకీయంగా విమర్శలకు తావిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment