సనంద్‌లో ఆదివారం జరిగిన ర్యాలీలో మోదీకి జ్ఞాపిక సమర్పిస్తున్న బీజేపీ నాయకులు
పాలన్‌పూర్/సనంద్/పంచమహల్: గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పాక్ నేతలతో ఇటీవల సమావేశమయ్యారన్న వార్తలపై ఆ పార్టీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఉత్తర గుజరాత్‌లోని పాలన్‌పూర్ జిల్లాలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ గుజరాత్ సీఎం కావాలంటూ పాకిస్తాన్ మాజీ ఆర్మీ డైరెక్టర్ జనరల్ సర్దార్ అర్షద్ రఫీక్ కోరటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ‘మణిశంకర్ అయ్యర్ నివాసంలో జరిగిన సమావేశంలో.. పాక్ హై కమిషనర్, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, భారత మాజీ రాష్ట్రపతి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ భేటీలో పాల్గొన్నట్లు మీడియా వార్తలొచ్చాయి.
దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం జరిగిందని చానెళ్లు పేర్కొన్నాయి. ఆ తర్వాతి రోజే మణిశంకర్ అయ్యర్ అభ్యంతరకరంగా మాట్లాడారు. ఇది చాలా సీరియస్ అంశం’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘ఓ వైపు పాక్ ఆర్మీ మాజీ డీజీ గుజరాత్ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటారు. మరోవైపు, పాకిస్తాన్ నేతలు మణిశంకర్ అయ్యర్ నివాసంలోనే ఆయనతో సమావేశమవుతారు. ఆ సమావేశంలో గుజరాత్ ప్రజలు, వెనుకబడిన తరగతులు, పేదలు, మోదీని అవమాన పరిచేలా మాట్లాడతారు. ఇలాంటి ఘటనలు కొత్త సందేహాలను లేవనెత్తుతాయని మీరనుకోవటం లేదా?’ అని మోదీ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలపై కాంగ్రెస్ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పద్మ అవార్డులే చెబుతాయి
తనపై ఇటీవల కాంగ్రెస్ నేతలు సూట్ బూట్ సర్కార్ అంటూ చేస్తున్న విమర్శలనూ మోదీ తిప్పికొట్టారు. యూపీఏ పదేళ్లలో, ఎన్డీయే మూడేళ్లలో పద్మ అవార్డులు అందుకుంటున్న వారి జాబితాయే పేదల పక్షపాతి ఎవరో వివరిస్తాయని సనంద్‌లో జరిగిన సభలో మోదీ తెలిపారు. ‘మారుమూల ప్రాంతాలైన సనంద్, వీరంగామ్ అద్భుతమైన అభివృద్ధి సాధిస్తాయని ఎవరైనా అనుకున్నారా? గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని విస్మరిస్తే.. బీజేపీ దీన్ని ఆటోమొబైల్ పరిశ్రమ కేంద్రంగా మార్చిందన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు టాటా నానో, మారుతి సుజుకి, భారత్ ఫోర్జ్ వంటి కంపెనీలతో వేల మందికి ఉపాధి కలుగుతోందన్నారు.
కాంగ్రెస్‌ను దేశం తిరస్కరిస్తోంది
అవినీతి, కుల రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌పై మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘అవినీతిని అలవాటుగా మార్చుకున్న వారు దేశాన్ని బాగుచేయలేరు. రాష్ట్రాన్ని కులం పేరుతో విడగొడుతున్నారు’ అని అన్నారు. ఒక్కో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పంచమహల్ కాలోల్‌లో జరిగిన సభలో మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment