మాట్లాడుతున్న పార్థసారథి, పక్కన జోగి రమేష్
విజయవాడ: కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఏం ఆశించి తెలుగుదేశం పార్టీలో చేరారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి సూటిగా ప్రశ్నించారు. ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్ సీపీలోనే ఉంటానని చెప్పిన ఆమె ఇప్పుడు టీడీపీలోకి ప్రాణంతోనే వెళుతున్నారా? లేక మరే విధంగానైనా వెళుతున్నారా? అని ప్రశ్నించారు. అత్యున్నతమైన చట్టసభలో ఎంపీగా కూర్చోబెట్టిన పార్టీకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళగా పేద ప్రజల బాగు కోసం పోరాడాల్సిన ఎంపీ తన సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం సబబు కాదన్నారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌తో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుట్టా రేణుక కర్నూలు ప్రజలకు ముఖ్యంగా బలహీన వర్గాలకు వివరణ ఇచ్చుకోవాలని డిమాండ్ చేశారు.
రూ.70 కోట్లు ఆశించి వెళ్తున్నారా?
బలహీన వర్గాలకు చెందిన మహిళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టికెట్ ఇచ్చి గెలిపిస్తే బుట్టా రేణుక కొంచెమైన విశ్వాసం లేకుండా పార్టీ మారారని ధ్వజమెత్తారు. పార్టీ మారితే దాదాపు రూ.70 కోట్లు ఇచ్చేలా ఒప్పందాలు జరిగినట్లు జనం చెప్పుకుంటున్నారని, డబ్బులు ఆశించే వెళ్లారా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజ్యాంగం, చట్టాలపై గౌరవం లేదని పార్థసారధి మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నత విలువలు నెలకొల్పాలనే ఉద్దేశంతో టీడీపీ ఎమ్మెల్సీగా శిల్పా చక్రపాణిరెడ్డితో రాజీనామా చేయించి తమ పార్టీలో జగన్ చేర్చుకున్నారని గుర్తు చేశారు. అది చూసిన తరువాతైనా చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం కలగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్రతో అసలు రంగు బయటపడుతుందనే భయంతోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.
దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి
ప్రతిపక్ష నేత వైఎస్ వైఎస్ అ«ధ్యక్షతన జరిగిన బీసీ ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం విజయవంతమైందని పార్థసారధి తెలిపారు. టీడీపీ సర్కారు కుల వృత్తులను తొక్కేస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదని బీసీ సంఘాల నేతలు ప్రతిపక్ష నేత దృష్టికి తెచ్చారన్నారు. దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీపై చాలెంజ్‌లు విసరటం సిగ్గు చేటన్నారు. ఇన్నేళ్ల చంద్రబాబు పరిపాలనలో ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని ఎద్దేవా చేశారు. బీసీలకు చేసిన అభివృద్ధిపై కేబినెట్ మంత్రులంతా బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో కలిసి విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్‌కు రావాలన్నారు. బడుగు, బలహీన వర్గాలు అభివృద్థి చెందాలని అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనన్నారు.
బీసీ మంత్రులకు అధికారాలేవీ?
రాజధాని డిజైన్ల కోసం సినీ దర్శకుడు రాజమౌళిని లండన్‌కు పంపించడం చూస్తుంటే చంద్రబాబు మానసిక పరిస్థితిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. విపక్ష ప్రజాప్రతినిధులను చేర్చుకుంటూ చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. బలహీన వర్గాలకు ఇచ్చిన మంత్రి పదవులను అలంకారప్రాయంగా మార్చి అధికారాలన్నీ లోకేష్‌కు అప్పజెప్పారన్నారు. కనీసం వీఆర్‌వో, వీఆర్‌ఏలను కూడా బదిలీ చేసే అధికారం లేని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విపక్ష నేత జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. బోయలను ఎస్టీల్లోకి చేరుస్తామన్న హామీని నెరవేర్చాలని చంద్రబాబును మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం బోయలను మోసగించిన ఆయనకు విపక్ష నేతను విమర్శించే హక్కు లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment