యాకుత్‌పురా ఈదీ బజార్‌లో ప్రచారం చేస్తున్న హైదరాబాద్ లోక్‌సభ మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి,సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి ఇంకా మిగిలింది ఐదు రోజులే. ఈ నెల 9వ తేదీ (మంగళవారం) సాయంత్రం ఐదు గంటలతో ప్రచార పర్వం పరిసమాప్తం చేయాల్సిందే. కానీ ఇంకా ప్రధాన పార్టీ అభ్యర్థుల ప్రచారం జోరందుకోలేదు. ఇప్పటి వరకు లోపాయికారీ ఒప్పందాలు, దాగుడుమూతలు, ఆర్థిక వనరుల సమీకరణ వ్యవహారాలకే అధిక సమయం కేటాయించిన అభ్యర్ధులు.. నామమాత్రంగా ఉదయం రెండు గంటలు, సాయంత్రం మరో రెండు గంటలతో ప్రచారాన్ని సరిపెడుతున్నారు. అందులో కొందరు అభ్యర్థులు పాదయాత్రలు, రోడ్‌షోలు, సభలు, సమావేశాలకు పరిమితమయ్యారు. మరికొందరు మిత్రపక్షాల ముఖ్య నేతలను, ఓటర్లను ప్రభావితం చేసే తటస్థులతో ప్రత్యేకంగా సమావేశమై మద్దతు కోరుతున్నారు. చోటామోటా నాయకులైతే బస్తీల్లో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల నుంచి కొందరు అగ్రనేతలు మాత్రమే గ్రేటర్‌లో ప్రచారం చేశారు.
అగ్రనేతలు ఇలా..
ఇటీవల టీఆర్‌ఎస్ పక్షాన ఎల్‌బీ స్టేడియంలో తలపెట్టిన సభకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కాలేదు. మరోవైపు అభ్యర్థుల పక్షాన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుడిగాలిలా రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో సభల్లో సైతం పాల్గొని ప్రసంగించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ నగరంలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. ప్రధాని పర్యటన గ్రేటర్ కమలనాథుల్లో జోష్ నింపింది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ లోక్‌సభ అభ్యర్థుల పక్షాన ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.
కానీ ఆ పార్టీ అభ్యర్థుల తరఫున కొందరు ఢిల్లీ నేతలు నియోజకవర్గ సమావేశాలు, ప్రచారాల్లో పాలుపంచుకుంటున్నారు. మరోవైపు చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా కూడా ప్రచారం చేస్తున్నారు. మజ్లిస్ పార్టీ పక్షాన ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా అసదుద్దీన్ నియోజకవర్గంలో పాదయాత్రలతో ఓట్లను అభ్యర్థిస్తూనే రోజుకో బహిరంగ సభలో పాల్గొంటున్నారు. మరోవైపు మిత్రపక్షమైన టీఆర్‌ఎస్ మద్దతు గా ఆయా నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. అదేవిధంగా తన పార్టీ పోటీ చేస్తున్న మహారాష్ట్ర, బిహార్ లోక్‌సభ అభ్యర్థుల తరఫున కూడా ఆయన హాజరవుతున్నారు. జనసేన పక్షాన సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థుల తరఫున గురువారం ఎల్‌బీ స్టేడియంలో జరిగిన బహిరంగసభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, బీఎస్సీ అధినేత మాయవవతి పాల్గొని ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment