
సాక్షి, అమరావతి: తాను జీవితాంతం రాజకీయాల్లోనే కొనసాగుతానని, ఇక నుంచి కార్యకర్తలకు మరింత అందుబాటులో ఉంటానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తన శవాన్ని నలుగురు మోసుకు వెళ్లే వరకూ తాను జనసేనను మోస్తూనే ఉంటానని అన్నారు. తాను ఓటమిని అంగీకరించేవాడిని కాదని, విజయం సాధించే వరకు పోరాడతానని స్పష్టం చేశారు.
ఎన్నికల ఫలితాలపై పార్టీ పరమైన సమీక్షల్లో భాగంగా ఆయన నిన్న విశాఖ జిల్లాకు చెందిన జనసేన అభ్యర్థులతో మంగళగిరిలోని తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. అనంతరం గాజువాక నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.పవన్ అనే వ్యక్తిని అసెంబ్లీ అడుగు పెట్టనివ్వకూడదనే లక్ష్యంతో ప్రత్యర్థులు పని చేశారని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. ఆ ప్రజా తీర్పును గౌరవిద్దాం’ అన్నారు. కాగా ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేసి పవన్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.