
సాక్షి, అమరావతి: బీజేపీతో పొత్తును ఫలప్రదం చేసుకునేందుకు రాష్టానికి ప్రత్యేక హోదా డిమాండ్ గురించి ఇక భవిష్యత్‌లో ఎప్పుడూ ప్రస్తావించబోనని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ హామీ పత్రం రాసిచ్చారు! గురువారం రెండు పార్టీల మధ్య చర్చల సందర్భంగా ఈ మేరకు పరస్పర అవగాహన ఒప్పందం జరిగినట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ– జనసేన మధ్య తాజాగా కుదిరిన పొత్తు సందర్భంగా చర్చించిన అంశాలకు లోబడే పని చేయాలని రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు పార్టీల నేతల భేటీలో చర్చించిన అంశాలను మీటింగ్ మినిట్స్ రూపంలో రికార్డు చేశారు. అంటే చర్చించిన అంశాలను, ఇరుపక్షాలు కలిసి తీసుకున్న నిర్ణయాలను పత్రాలపై రాసుకొని రెండు పక్షాల నేతలు సంతకాలు చేయడం అన్నమాట. బీజేపీ– జనసేన పొత్తు చర్చల సారాంశాన్ని మీటింగ్ మినిట్స్‌లో రికార్డు చేసినట్టు బీజేపీ వర్గాలు వివరించాయి.
అవగాహన లేక తప్పుబట్టా!
తెలంగాణతోపాటు ఇతర పొరుగు రాష్ట్రాల్లో బీజేపీ తరఫున పవన్‌కల్యాణ్ ప్రచారం చేయడం మొదలు ఏపీలో తాజా పరిణామాల దాకా ఇరు పార్టీల పొత్తుల సందర్భంగా చర్చకు వచ్చాయని చెబుతున్నారు. హోదాకు బదులుగా ప్యాకేజీ కూడా చర్చకు వచ్చింది. హోదాకు బదులుగా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ రాష్ట్ర ఆర్థికాభివృద్దికి ఉపయోగపడుతుందని బీజేపీ నేతలు పవన్‌కు వివరించినట్లు తెలిసింది. పవన్ దీనికి అంగీకరిస్తూ హోదాకు బదులుగా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై అప్పట్లో అవగాహన లేక తప్పుబట్టానని, భవిష్యత్తులో ప్రత్యేక హోదాపై మౌనం వహిస్తానని సంజాయిషీ ఇచ్చుకున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. హోదాపై పవన్ వెల్లడించిన ఈ అభిప్రాయం కూడా మీటింగ్ మినిట్స్‌లో రికార్డు అయిందని వెల్లడించారు.