సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
సాక్షి, ములుగు : తెలంగాణలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ సమన్యాయంతో పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ వైపు దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని డీఎల్‌ఆర్ గార్డెన్స్‌లో సోమవారం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను గెలిపించుకుంటే ఢిల్లీలో సీఎం చక్రం తిప్పడం ఖాయమన్నారు.
పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని, ఎంపీ సీతారాంనాయక్‌కు అన్యాయం జరుగలేదని, సుముచిత స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఆరు నెలల కాలంలో చెరువులకు దేవాదుల ద్వారా నీటిని అందించి మత్తళ్లు పోసేలా చర్యలు తీసుకుంటామని, అలాగే పోడు రైతులకు పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ములుగు జిల్లాలో పార్టీకి సంబంధించి మనలో మనకే లొల్లి ఉందని, శాసన సభ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను పునరావత్తం కాకుండా చూసుకోవాలని సూచించారు.
మండల, గ్రామ స్థాయిలో కార్యకర్తలు సమన్వయంగా పని చేస్తు పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించామని, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ధైర్యంగా ఓటును అడగాలని, ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ప్రజలకు వివరించాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 100 నుంచి 70 శాతం ఓట్లు పడిన గ్రామాలను గుర్తించి దత్తత తీసుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని, పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఇన్‌చార్జిలను నియమించే పరిస్థితి కూడా ఆ పార్టీకి లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవిత మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ ప్రజలను ఆశీర్వదించి గెలిపించాలని, సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బిల్ట్ పరిశ్రమ పునరుద్ధరణ, చెరువులను రిజర్వాయర్‌లుగా మార్చడం, పోడు రైతులకు పట్టాలు అందించడంలో ముందుంటానని అన్నారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అన్ని రకాల సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment