ప్రచారం సమాప్తం
హైదరాబాద్: మన రాష్ట్రంలోని తెలంగాణతోపాటు ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం సమాప్తమైంది. మైకులు మూగబోయాయి. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఏడవ విడత జరిగే పోలింగ్కు సంబంధించి మొత్తం 89 లోక్‌సభ నియోజకవర్గాలలో అభ్యర్థులు తమ ప్రచారం ముగించారు. ముమ్మర ప్రచారానికి తెరపడింది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు, 119 శాసనసభ స్థానాలకు ఈ నెల 30వ తేది బుధవారం పోలింగ్ నిర్వహిస్తారు.
సాయంత్రం 6 గంటల తర్వాత తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి అనురాగ్ శర్మ హెచ్చరించారు. 37 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 107 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు ఆయన చెప్పారు.
ఇదిలా ఉంటే, అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్ల సమాచారంపై ఫిర్యాదులు ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని ఎన్నికల సంఘం (ఇసి) స్పష్టం చేసింది. తప్పుడు అఫిడవిట్లపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఈ సర్క్యులర్ జారీ చేసింది.